పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

– శ్రీ జిల్లా పంచాయతీ అధికారి సురేందర్‌
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేటాయించాలని ఒక ప్రణాళికతో పారిశుధ్య పనులను చేపట్టాలని ఇన్‌ఛార్జి డీపీఓ, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి సురేందర్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని అన్ని మురుగు కాలువలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రోడ్డు డివైడర్‌ మధ్యలో ప్రజల ఆరోగ్యానికి హానిని కలిగించే చెట్లు పెరగడంతో వాటిని తొలగించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో దశలవారీగా పలు మురుగు కాలువల నిర్మాణాన్ని, కల్వర్టు లను చేపడతామని వెల్లడించారు. ఎల్లవేళలా తాగు నీరు, విద్యుత్‌ సౌకర్యం ఉండేలా చూస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ ఆసిఫాబాద్‌ గ్రామపంచాయతీకి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ సభలో ప్రజలు కొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలిస్తే రాజంపేట గుండి రోడ్డులో విద్యుత్‌ ఓల్టేజ్‌ తక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికార దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలోని బజారు వాడి అంగన్వాడి కేంద్రం 1లో కొత్తగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, బజార్‌ వాడిలోని మసీదు వద్ద కొత్తగా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు గాని వాటికి వైర్లు అమర్చలేదని, పైకాజినగర్‌ హుడ్కో కాలనీలో మురుగు కాలువలు పూడికతో నిండి రోడ్డుపై ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఈ గ్రామ సభలో సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌ సిబ్బంది సంతోష్‌ పాల్గొన్నారు.

Spread the love