నేటి నుంచి ధరణి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు అర్జీల పరిష్కారంపై సీసీఎల్ఏ వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది. ధరణి సంబంధించి తహశీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏ అధికారులకు అధికారాలు బదలాయింపు చేసింది. ఈ నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. నేటి నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో అధికారులు అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

Spread the love