– కొత్తూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
– రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
– షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
మున్సిపాలిటీకి అధిక నిధులు వెచ్చించి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్టు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడ, స్టేషన్ తిమ్మాపూర్‌లలో మంగళవారం ఆయన పర్యటించి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. 4 కోట్ల రూపాయల హెచ్‌ఎండిఏ నిధులతో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పర్యటించి గృహలక్ష్మి పథకం కింద మంజూరైన లబ్ధిదారులను కలిసి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వీధివీధిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని త్వరలోనే పనులు పూర్తి అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కమిషనర్ వీరేందర్, కౌన్సిలర్లు పీర్లగూడెం మాధవి గోపాల్ గౌడ్, మాదారం నరసింహ గౌడ్, ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, నాయకులు ఎమ్మే సత్యనారాయణ, ఏనుగు జనార్దన్ రెడ్డి, మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్, కమ్మరి జనార్దన్ చారి, మహేష్‌గౌడ్, బీఆర్‌ఎస్ మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.