ఆయిల్ ఫాం తోటల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది

– సాగుదారుల కు చేరువలో ఆయిల్‌ఫెడ్ సేవలు
– ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  నూతన సిబ్బందికి శిక్షణ
– ఆయిల్ ఫాం క్షేత్రాలను సందర్శించిన ఎం.డి,జీఎం లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
టీఎస్ ఆయిల్‌ఫెడ్ క్షేత్ర స్థాయి సేవలు రైతుకు చేరువ కానున్నాయి. ఇందుకోసం సంస్థ పర్యవేక్షణ ఆధికారులు ను నియమించి క్షేత్రస్థాయిలో సాగు పరిశీలన,తోటలను ఆశించిన చీడపీడలు గుర్తింపు,రైతుకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు పరిపాలనా విభాగానికి సమాచారం అందించనున్నారు. వీరికి సంస్థ విశ్రాంత ఉన్నత అధికారి,ఆయిల్ ఫాం సాగు,విస్తీర్ణం పెంపుదల లో అనుభవజ్ఞుడు రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో గత రెండు రోజులు గా ఆయిల్ ఫాం క్షేత్రాల్లో సందర్శిస్తూ శిక్షణ ఇస్తున్నారు. బుధవారం ఆయిల్‌ఫెడ్ ఎం.డి సురేందర్,జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి లు నూతన సిబ్బందితో పాల్గొని జిల్లాలోని దమ్మపేట మండలం పట్వారీ గూడెం లో నూతనంగా ఆయిల్ ఫాం మొక్కలు నాటిన ఇనుగంటి మోహన్ రావు,కోటగిరి వెంకటేశ్వరరావు ల క్షేత్రాలను,అశ్వారావుపేట మండలం భీముని గూడెం లోని కాసాని వెంకటేశ్వరరావు ముదురు తోట ను సందర్శించి సిబ్బందికి సూచనలు,సలహాలు ఇచ్చారు. అనంతరం ఎం.డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా నియమించిన సిబ్బంది ఎల్లప్పుడూ రైతులకు చేరువలో ఉంటారని,ఎప్పటికప్పుడు తోటలను పరిశీలించి సాంకేతిక సలహాలు,సాగులో మెరుగైన యాజమాన్యం పద్దతులను వివరిస్తూ ఉంటారని అంతే గాకుండా రైతులకు ఆయిల్‌ఫెడ్ పరిపాలనా విభాగానికి అనుసంధానంగా ఉంటారని తెలిపారు.వీరి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి,డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలక్రిష్ణ,అశ్వారావుపేట,అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్ లు నాగబాబు,కళ్యాణ్ గౌడ్ లు పాల్గొన్నారు.
Spread the love