విషం చిమ్ముతోంది…!

Deadly 'Chittanoor Ethanol Company'– ప్రాణాంతకంగా ‘చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ’
– కాలుష్యంతోనే ప్రజల జీవనం
– తలుపులు మూసుకున్నా గుప్పుమంటున్న వాసన
– మమ్మల్ని ఆదుకోండంటున్న చుట్టుపక్కల ప్రజానీకం
– ఫ్యాక్టరీ లోపలికి వెళ్లనీయకుండా గట్టి నిఘా
– చూడటానికి వచ్చిన నిర్మల్‌ ప్రజలను తరిమిన పోలీసులు
– యాజమాన్యానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఉన్నతాధికారుల మద్దతు
– ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్‌ మద్దతు.. ఇప్పుడు షరా మామూలే..
– రాష్ట్రంలో మిగతాచోట్ల ఆందోళనలకు సన్నద్ధం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి/విలేకరులు
పండ్ల తోటలు, పామాయిల్‌తో పాటు ఆధునిక వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు వచ్చేలా సాగు చేస్తామంటూ ఇథనాల్‌ కంపెనీ యాజమాన్యం నమ్మబలికింది. మిల్లులు పెట్టి పంటలను కొనుగోలు చేస్తామని కంపెనీ నిర్వాహకులు హామీ ఇచ్చారు. బడుగు జీవుల నుంచి భూములను కారుచౌకగా తీసుకున్నారు.. కొన్ని రోజులు నీలగిరి తోటలు పెంచారు.. రైతులతో మమేకం అయ్యారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా కాలుష్యం, విషపు వాయువు వెదజల్లే ఇథనాల్‌ కంపెనీని చిత్తనూర్‌ వద్ద పెట్టారు.. ఇప్పుడు ఆ ప్రాంతం కాలుష్యం, దుర్వాసనతో ప్రాణాంతకంగా మారింది. పరిసర ప్రాంతాలే కాకుండా.. చిత్తనూరు నుంచి వచ్చే మన్నెవాగులో కంపెనీ వ్యర్థాలు కలుస్తున్నాయి. అక్కడి నుంచి రామన్‌పాడు ద్వారా కృష్ణానదిలోకి చేరడం వల్ల ఆ నీరంతా కలుషితం అవుతోంది. దుర్గంధం, కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దగ్గు, దమ్ము, చర్మ వ్యాధులతో ఆస్పత్రిలో చేరుతున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా గతంలో చేపట్టినట్టే మళ్లీ ఐక్యంగా ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే, ఫ్యాక్టరీ దరిదాపులకు ఎవరినీ రానీయకుండా యాజమాన్యం భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది. నిఘా నేత్రంలో కంపెనీ దగ్గర చీమ చిటుక్కుమన్నా పోలీసులు వస్తున్నారు. వారం రోజుల కిందట కంపెనీని చూడటానికి వచ్చిన నిర్మల్‌ జిల్లా ప్రజలను అడ్డుకున్నారు.
నారాయణపేట జిల్లా మర్రికల్‌ మండల పరిధిలోని చిత్తనూర్‌ పరిధిలో జూరాల ఆర్గానిక్‌ ఇథనాల్‌ కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఇథనాల్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.
దీనికి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చిత్తనూర్‌లో 460 ఎకరాల సాగు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇక్కడ పండ్ల తోటలు, పామాయిల్‌తో పాటు ఆధునిక వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు వచ్చేలా పంటలను సాగు చేస్తామని నమ్మబలికారు. కొన్ని రోజులు నీలగిరి తోటలు పెంచిన తరువాత జూరాల ఆర్గానిక్‌ పేరుతో కంపెనీ ప్రారంభమైంది. ఇక్కడ 2.50 కేజీల బియ్యం.. 4 లీటర్ల నీటితో ఒక లీటరు ఇథనాల్‌ లిక్విడ్‌ తయారు చేస్తారు. 20 శాతం ఇథనాల్‌ను ఒక లీటరు పెట్రోల్‌ తయారీకి ఉపయోగిస్తారు. రోజుకు 60 లక్షల లీటర్ల నీరు ఉపయోగిస్తారు. 13 వేల టన్నుల వ్యర్థాలు బయటకు వస్తాయి. కరపెనీకి రామన్‌పాడు రిజర్వాయరు నుంచి టీఎంసీ నీటిని తరలిస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగావకాశాలు, పండిన పంటకు గిట్టుబాటు ధర, ఇతర అనేక ఉపయోగాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఎలాంటి హానీ ఉండదని, కాలుష్యం ఉండదని చెబుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని, భూములకు మంచి రేటు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని యాజమాన్యం అంటోంది. 2025 ఏప్రిల్‌ నుంచి ఇథనాల్‌ను పెట్రోల్‌కు ఉపయోగించడం వల్ల వాము కాలుష్యం ఉండదని చెబుతోంది.
వాస్తవ పరిస్థితులు వేరు..
అయితే, యాజమాన్యం చెప్పినట్టు అలాంటి పరిస్థితులు లేవు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు చిత్తనూరు గ్రామం గుండాపోయే మన్నెవాగులో కలుస్తున్నాయి. ఈ వాగులో స్నానం చేసిన చిన్నారులకు శరీరం మొత్తం బొబ్బలు వచ్చాయి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు వచ్చి ఆస్పత్రులపాలయ్యారు. వ్యర్థాలను ధ్వంసం చేయకుండా వాగులోకి, పంట పొలాల్లోకి వదులుతున్నారు.
కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల నర్వ, సీసీకుంట, మర్రికల్‌, ఆత్మకూరు, అమరచింత, ధన్వాడ వంటి మండలాల పరిధిలో 110 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి కంపెనీకి వ్యతిరేకంగా ఏడాదిపాటు ఉద్యమించినా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కనికరించలేదని గ్రామస్తులు ‘నవతెలంగాణ’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని ‘నవతెలంగాణ’ సందర్శించినప్పుడు గతంలో ఉన్న పరిస్థితులే ఇప్పటికీ ఉన్నాయి. ఉద్యమాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందారు. ఇక్కడ ఫ్యాక్టరీ.. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉందని, తమ సమస్యను ఏ ఒక్కరూ వినడం లేదంటున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చినా, ఇప్పుడు తమవైపే చూడటం లేదని వాపోయారు.
ఉద్యమంలోకి ఇతర ప్రాంతాల ప్రజలు
నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లిలో ఇలాంటి కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. దాంతో అక్కడి నుంచి రెండు బస్సుల్లో చిత్తనూరు జూరాల ఆగ్రో కంపెనీని చూడటానికి వచ్చారు. కంపెనీ ఏర్పాటయితే కలిగే అనర్థాలను చూడటానికి వస్తే పోలీసులు అడ్డుకొని బస్సుల నుంచి దిగకుండా తిరిగి హైదరాబాద్‌ తరలించారు. ఇదే సమయంలో చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీని నిలిపేయాలని స్థానిక ప్రజలు ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. గద్వాల్‌ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో నిర్మించతలపెట్టిన ఇథనాల్‌ ఫ్యాక్టరీని నాలుగైదు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫ్యాక్టరీ పనులను అడ్డుకున్నారు. తహసీల్దార్‌, ఎస్‌ఐలను కలుసుకుని వినతిపత్రం ఇచ్చారు.
తలుపులు మూసుకున్నా దూసుకొస్తోంది
రాత్రి పూట విషపు గాలులతో ఇంట్లో ఉండలేక పోతున్నాం. తలుపులు మూసుకున్నా వాసన దూసుకొస్తోంది. అన్నం, నీళ్లు సైతం విషం అవుతున్నాయి. కంపెనీని తొలగించండి.. మమ్ములను ఇక్కడి నుంచి ఖాళీ అన్నా చేయండి.
ఆశప్ప, ఎక్లాపూర్‌, మర్రికల్‌ గ్రామం
పోలీసులు యజమానుల్లా వ్యవహరిస్తున్నారు
ప్రజల ప్రాణాలను హరించే ఇథనాల్‌ కంపెనీకి యజమానులుగా పోలీసులు వ్యవహరి స్తున్నారు. మేము అధికారులను సైతం కలువలేకపోతున్నార. గాలి ఎక్కడికి వీస్తే.. వాసన అక్కడికి వెళ్తోంది. ఆ వాసనకు ఉండలేకపోతున్నాం.
ఉస్మాన్‌, ఎక్లాస్‌పూర్‌ గ్రామం మర్రికల్‌
మా దృష్టికి రాలేదు
నేను తహసీల్దార్‌గా వచ్చి రెండు నెలలైంది. నా దగ్గరకు కంపెనీ కాలుష్యంపై ఎటువంటి ఫిర్యాదూ రాలేదు. ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాను. ప్రజలకు ఎటువంటి హాని జరిగినా చర్యలు తీసుకోవడానికి అభ్యరతరం లేదు.
మర్రికల్‌ తహసీల్దార్‌ జమీల్‌

Spread the love