క్రీడా స్ఫూర్తి వెలగాలి

Sampadakiyamఆటలో జట్టు గెలవాలని కోరుకోవడం ఎంత సహజమో, గెలుపోటములు కూడా అంతే సహజం. ఎందుకంటే రెండు జట్లు పోటీ పడితే ఏదో ఒక జట్టే గెలుస్తుంది. మన జట్టు ఓడిపోతే ఆ ఓటమిని స్వీకరించి గెలిచిన జట్టును అభినందించడమే నిజమైన క్రీడా స్ఫూర్తి. కాని ప్రపంచ కప్‌లో భారత జట్టు ఓటమి పట్ల క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం చేతకాని కొన్ని మూకలు సోషల్‌ మీడియా వేదికగా నానా యాగీ చేస్తున్నాయి. వీటిని తట్టుకొలేని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై చనిపోవడం అత్యంత విషాదం.
ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు అంటూ ఊరించిన విజయం ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని గెలవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. ఐసీసీ టోర్నీల్లో కంగారు జట్టు రికార్డుస్థాయిలో ఆరోసారి విజేతగా నిలవగా.. మూడోసారి కప్‌ను ముద్దాడాలని భావించిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. అత్యధిక పరుగుల వీరుడుగా విరాట్‌ కోహ్లి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన ధీరుడిగా మహ్మద్‌ షమీ.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రాణించిన రోహిత్‌ శర్మ.. మిడిలార్డర్‌లో స్థాయికి తగ్గట్లు ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌.. తమ పని తాము చేసుకుపోతూ విజ యాల్లో తమ వంతు పాత్ర పోషించిన బౌలింగ్‌ దళం… గొప్పగా ఆడింది భారత్‌ జట్టు. ఫైనల్‌ ఓటమి బాధ కలిగించేదే అయినా అదో విపరీతంగా మారకూడదు. విద్వే షాలకు దారితీయ కూడదు.
ఈ వరల్డ్‌కప్‌లో కేవలం టీమిండియా ఆటగాళ్ల ల్లోనే కాదు. ఈ టోర్ని మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ఆట గాడిగా చరిత్ర సృష్టించాడు మహ్మద్‌ షమీ. అలాంటి భారత టాప్‌ బౌలర్‌ జాతీయతను, దేశభక్తిని శంకించేలా వ్యాఖ్య లు చేయడం విద్వేష రాజకీయాలకు పరాకాష్ట. ఆటలకు మతం రంగు పులిమే ఇటువంటి క్షుద్ర రాజకీయాలు క్రికెట్‌కే కాదు, దేశ సమైక్యత, సమగ్రతలకే ప్రమాదకరం. మత విద్వేషాలను క్రీడలకు సైతం వ్యాపింపజేసే ఇటువంటి ధోరణులను ఆధునిక సమాజం ఎంత మాత్రం అనుమతించకూడదు. క్రీడలను క్రీడలుగానే చూడాలి.
నేడు క్రీడా సంస్కృతి మారిపోయింది. ప్రస్తుతం క్రీడలంటే డబ్బు, వ్యాపారం. బెట్టింగులు, మ్యాచ్‌ఫిక్సింగ్‌లు ఇప్పటికీ క్రీడారంగాన్ని భ్రష్టు పట్టిస్తుండగా, ఇప్పుడు ఉద్వేగం, దేశభక్తి పేరుతో ఉన్మాదం తోడ య్యింది. పాలకులు కూడా క్రీడలను వ్యాపార దృష్టితో మాత్రమే చూస్తున్నారు. ఆటలతో విద్యార్ధులు, యువకులు చైతన్యం అయితే తమకు ప్రమాదమని భావించే పాలకవర్గాలు నేడు వారిని క్రమంగా ఆటస్థలాలకు దూరం చేస్తున్నాయి. ప్రస్తుత బీజేపీ సర్కార్‌ మరో అడుగు ముందుకేసి మొబైల్‌కు ఎడిక్ట్‌ చేయాలని యోచిస్తోంది. అందుకు అవసరమైన కొత్త రకమైన మొబైల్‌, వెబ్‌ ఆధారిత గేమ్‌లను తీసుకురావటానికి యోచిస్తున్నది. ఆనందం కోసం మొదలైన ఆటకు బానిసలై సమస్తం కొల్పోతూ.. ప్రవర్తన మార డం కూడా ఒక మానసిక వ్యాధేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నది. స్వీయ నియంత్రణ కోల్పోయి, ఏడాది కంటే ఎక్కువకాలం వీటిని ఆడుతూ.. అదే పనిగా బతికేవారిని ‘గేమింగ్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నట్టుగా పరిగణించాలని డబ్య్లూ హెచ్‌ఓ సూచిస్తున్నది. ఇప్పటికే పబ్జీ లాంటి గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయి ఎంతో మంది హత్యలకు పాల్పడారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాలు వ్యాపార ప్రయోజన క్రీడలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ క్రీడలను నిర్వీర్యం చేయడం వల్లనే ఈ దుష్పలితాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం తేనున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, సమస్య-పరిష్కార, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయటం కోసమని కేంద్రం చెప్తున్నది. జాతీయభావం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను స్పృశిస్తాయని బీజేపీ సర్కార్‌ వింతవాదన చేస్తున్నది. కానీ, వారి అంతరార్ధం వేరు. కేవలం ఈ గేమ్స్‌ను తయారుచేసే కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాన్ని పెంచడం, ప్రజలను వాటికి బానిసలుగా మార్చడం కోసమే ఈ యాప్స్‌ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆటలు పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్ది, ఒత్తిడిని తగ్గించి గెలుపోటములు సహజమనే జీవిత సత్యాన్ని ప్రబోధిస్తాయి. కులమతాలకు, భాష, ప్రాంతం వంటి భావాలకు అతీతంగా సమైక్యత, సమభావం ఆటల ద్వారా అలవడతాయి. అలాంటి ఆటలకు ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కావు, కాలేవు. అందుకే ఆటలు చదువులో ఒక భాగం కావాలి. అన్ని పాఠశాలల్లోనూ ఆటలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి, ఆటలను కరికులంలో కచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అసలు సిసలు క్రీడాభివృద్ధి అవుతుంది. కానీ, ఇవన్ని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి యువతను యాప్‌లకు బానిసలు చేయడం సరికాదు. ప్రతికూల పరిస్థితుల్లో స్థైర్యం కోల్పోకుండా స్థిమితంగా కొనసాగడం విజేతల లక్షణం. అలా విలువైన ప్రదర్శనకు సిద్ధపడితే మున్ముందు భారత్‌ ప్రపంచకప్‌ కల సాకారం అవుతుందనడంలో సందేహం లేదు.

Spread the love