నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అన్నార్తులు, నిరు పేదలు, కార్మిక, కర్షక శక్తులే తన కవితా వస్తువులంటూ మహాకవి శ్రీశ్రీ గొప్పగా చెప్పుకునేవారని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మోతుకూరి నరహరి అన్నారు. సామాన్యుడి పక్షపాతిగా ఆయన భూస్వామ్య శక్తులపై తన కవితా ఖడ్గాన్ని ఎత్తారని తెలిపారు. అందువల్లే శ్రీశ్రీ సాహిత్య సమకాలీనత నేటికీ తగ్గలేదని వివరించారు. తెలంగాణ సాహితీ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి శ్రీశ్రీ 40వ వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ… శ్రీశ్రీ మన నుండి దూరమై 40 ఏండ్లు గడిచినా ఇప్పటికీ ఆయన సాహిత్య సమకాలీనత, ప్రాసంగికత మన ముందే ఉందని చెప్పారు. అట్టడుగు శ్రామికవర్గపు దైన్య జీవితాన్ని మార్చాలంటూ పదండి ముందుకు.. పదండి తోసుకు… అంటూ ఆయన తన అక్షరాలతో విప్లవ జయభేరి మోగించారని నివాళులర్పించారు. టీపీఎస్‌కే నిర్వాహకులు, కవి భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… శ్రీశ్రీ కవిత్వాన్ని, రచనలను అధ్యయనం చేయాలంటూ యువతకు సూచించారు. శ్రీశ్రీకి నివాళులర్పించిన వారిలో తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, కోశాధికారి అనంతోజు మోహనకృష్ణ, సహాయ కార్యదర్శి ఎస్‌కే సలీమా, ప్రముఖ కవి ప్రభాకరాచారి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, మహేశ్ దుర్గే, వెంకటేశ్, మహేశ్ తదితరులున్నారు.