నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్ వర్క్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్ వర్క్‌ను విస్తరించి 20 ఎంబీ ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం సహకారంతో ఫైబర్ నెట్ వర్క్ పైలట్ ప్రాజెక్టు కోసం సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెట్ వర్క్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామాల్లో కేబుల్ టీవీ సేవలు, కేబుల్ వర్చువల్ డెస్క్ టాప్ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.