కలెక్టరేట్ లో శ్రీకాంత చారి తల్లికి సన్మానం..

నవతెలంగాణ – యాదాద్రి: జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సన్మానం చేశారు. సన్మానం సందర్భంగా కలెక్టరేట్ లో అమరవీరుల కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణలో అమరుల కుటుంబాలకు న్యాయం ఎక్కడ జరిగింది అంటూ వారు వాపోయారు. తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్న అమరవీరుల కుటుంబాలకు గుర్తింపేలేదు అని బాధపడ్డారు. నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ప్రాణాలు అర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి కుటుంబం ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదా..?.. వేరే విధంగా చనిపోయిన వారిని తెలంగాణ అమరులుగా గుర్తించిన ప్రభుత్వం.. నిజమైన అమరుల కుటుంబాలను ఎందుకు మర్చిపోతుంది.? అంటూ కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాంత చారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదు అంటూ అమరుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు మూడెకరాల ఇస్తా అన్న భూమి ఎక్కడ పోయింది.. తెలంగాణకు తండ్రిలా ఉన్న కేసీఆర్.. అమరవీరుల కుటుంబాలకు తండ్రి ఎందుకు కాలేకపోతున్నాడు.. హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేయాలి.. కలెక్టర్ కు తమ సమస్యలు విన్నవించాడనికి వినతి పత్రం అందజేశాను అని శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైన అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపునిచ్చి.. వారిని ఆదుకోవాలని శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కోరారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాల బాధను తెలుసుకుని అండగా ఉంటే తమ పిల్లల ఆత్మలు కూడా శాంతిస్తాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Spread the love