– ఆదర్శంగా నిలుస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత
నవతెలంగాణ – రాయపర్తి
తోబుట్టువులకే సహాయం చేయని రోజులివి.. అలాంటిది ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు కలిసి చదువుకున్న బాల్య స్నేహితుల కుటుంబాలను ఆదుకుంటూ స్నేహ బంధానికి ప్రతిబింబంగా ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిలుస్తున్నాడు. మండల కేంద్రానికి చెందిన చిత్రకారుడు (ఆర్టిస్ట్ ) ఎండి యూసఫ్ జీవనశైలి నాడు విరిసిన ఇంద్రధనస్సు వలె ఉండేది. అందరితో ఆప్యాయంగా ఉంటూ చిత్రకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలక్రమేనా మారుతున్న పరిస్థితుల దృశ్య ఫ్లెక్సీలు రావడంతో అతడి కుంచె చిన్నపోయింది. కుటుంబ భారాన్ని మోస్తూ ఇబ్బందులకు గురవుతున్నాడు ఇదే క్రమంలో యూసుఫ్ పెద్ద కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి స్నేహితుడి కూతురి చికిత్స కోసం 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు గీసిన చిత్రకారుడు యూసుఫ్ కుటుంబానికి తమ స్నేహితుల బృందం ఎప్పుడు అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ప్రతినిధి, ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు గజవెల్లి ప్రసాద్, ఆశ్రఫ్ పాషా, కోలా సంపత్, నేతవత్ శ్రీధర్, దేదావత్ ఉపేందర్, గట్టు ప్రవీణ్, కోట బిక్షపతి, ఎండి హుస్సేన్, సల్మాన్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.