గ్రామీణ వేతనాల్లో స్తబ్ధత నిజమే

Stagnation in rural wages is real– జీతం భత్యం లేని కుటుంబ కార్మికులపై కుదరని ఏకాభిప్రాయం
– అంగీకరించిన ఆర్థికవేత్తలు
న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగ కల్పన పరిస్థితి మెరుగుపడుతోందని, అయితే కుటుంబంలో జీతం భత్యం లేకుండా పనిచేసే వారి (అన్‌పెయిడ్‌ ఫ్యామిలీ లేబర్‌ – యూఎఫ్‌ఎల్‌) సమస్యలను పట్టించుకోకపోతే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, బాత్‌ యూనివర్సిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ సంతోష్‌ మెరోత్రా అభిప్రాయపడ్డారు. యూఎఫ్‌ఎల్‌ సమస్యను పరిగణనలోకి తీసుకోకపోతే దేశంలో ఉద్యోగ కల్పన వెనకపట్టు పడుతుందని ఆయన తెలిపారు. సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఎకనమిక్‌ ప్రోగ్రెస్‌ (సీఎస్‌ఈపీ) ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం, ఆర్‌బీఐ అందించిన ఉద్యోగ సమాచారం లోపభూయిష్టంగా ఉన్నదని, దానిని మదింపు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ఆర్‌బీఐ సమాచారాన్ని మెరోత్రా పరిశీలించారు. 2022-23 నివేదికలోని వృద్ధి గణాంకాలను ఆయన సవాలు చేశారు. ‘గత మూడు నాలుగు సంవత్సరాలలో ఎనిమిది కోట్ల మందికి ఉపాధి లభించిందని ఆర్‌బీఐ చెబుతోంది. ఆ సమాచారం ప్రశ్నార్థకంగా ఉంది. తూర్పు ఆసియా, దక్షిణాసియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి కల్పన స్తబ్ధుగా ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంటే భారత్‌లో ఎలా పెరుగుతుంది?’ అని ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల కాలంలో ఉపాధి రూ. 54 కోట్ల నుంచి రూ.57 కోట్లకు మాత్రమే పెరిగిందని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఉపాధి కల్పనలో వ్యవస్థాగత మార్పులను ఆర్‌బీఐ పట్టించుకోలేదని తెలిపారు. మహిళలు… ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని, స్వయం ఉపాధిని పొందుతున్నారని ఆర్‌బీఐ నివేదిక చెప్పిందని అంటూ మహిళల భాగస్వామ్యం పెరగడం సానుకూల సంకేతమన్న ప్రభుత్వ వాదనను ఆయన సవాలు చేశారు. 2004 నుంచి మహిళలు వ్యవసాయ రంగాన్ని విడిచిపెడుతున్నారని చెప్పారు.
కుటుంబంలో జీతభత్యం లేకుండా పనిచేస్తున్న మహిళల సంఖ్య 2018-19లో 5.5 కోట్లు ఉండగా 2022-23 నాటికి 9.5 కోట్లకు పెరిగిందని, యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీఏ పాలనలోనే తొలిసారి ఉపాధి కల్పన పడిపోయిందని మెరోత్రా చెప్పారు. అయితే ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు సుర్జిత్‌ భల్లా ఈ అభిప్రాయంతో విభేదించారు. యూఎఫ్‌ఎల్‌ పెరుగుతోందని అంటూనే మొత్తం కార్మికులలో దాని శాతం తగ్గుతోందని ఆయన చెప్పారు. అందుకు ఆయన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ సమాచారాన్ని ఉటంకించారు. భారత్‌కు వ్యవసాయేతర ఉద్యోగాల అవసరం అధికంగా ఉన్నదని మెరోత్రా చెప్పగా రంగంతో నిమిత్తం లేకుండా ఉపాధి కల్పన పెరగాలని భల్లా సూచించారు. కార్మికుల కొరత కారణంగానే దేశంలో ఉపాధి కల్పన తగ్గుతోందని ఆయన చెప్పారు.
ఈ ఇరువురు ఆర్థికవేత్తలు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన కార్మికుల వాస్తవ వేతనాలు ఎదుగుబొదుగూ లేకుండా స్తబ్ధుగా ఉన్నాయని వారు తెలిపారు. నెలవారీ జీతాలు తీసుకునే గ్రామీణ ఉద్యోగుల వాస్తవ వేతనాలు 2018 నుంచి అలాగే ఉన్నాయని మరోత్రా చెప్పారు. ఈ అభిప్రాయంతో భల్లా ఏకీభవించారు. అయితే ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని ఆయన చెప్పారు. వాస్తవ వేతనాలలో పెరుగుదల లేకపోయినా తగ్గకపోవడాన్ని ఊరటగా భల్లా చెప్పుకొచ్చారు.

Spread the love