ఘోర రోడ్డు ప్రమాదం.. స్టార్‌ మారథాన్‌ అథ్లెట్ దుర్మరణం

నవతెలంగాణ-హైదరాబాద్ : కెన్యాకు చెందిన మారథాన్‌ స్టార్‌ అథ్లెట్‌ కెల్విన్ కిప్టుమ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అతడితోపాటు కోచ్‌ గెర్వైస్ హకిజిమానా కూడా ప్రాణాలు కోల్పోయాడు. 24 ఏళ్ల కెల్విన్‌ కెన్యాలోని కప్తగట్‌ నుంచి ఎల్డోరెట్‌కు కారులో బయల్దేరాడు. అతడు ప్రయాణిస్తున్న వాహనంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. అందులో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక మహిళా ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ కమాండర్‌ పీటర్ ములింగే వెల్లడించారు. ‘‘ ప్రమాదం జరిగిన సమయంలో కిప్టుమ్‌ స్వయంగా కారు డ్రైవింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది’’ అని ఆయన తెలిపారు.
గతేడాది అక్టోబర్‌లోనే మారథాన్‌లో కెల్విన్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. షికాగోలో జరిగిన ఆ పోటీల్లో 2 గంటల 35 సెకన్లతో వరల్డ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెన్యాకే చెందిన ఎలియడ్ కిప్చోగే పేరిట ఉన్న రికార్డును 34 సెకన్ల ముందే అధిగమించాడు. మూడో పోటీలోనే ఈ ఘనత సాధించడం విశేషం. అప్పటికి అతడి వయసు 23 ఏళ్లే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ కెల్విన్‌ హాట్‌ ఫేవరెట్‌.

Spread the love