– మాజీ సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రొఫెసర్ జయశంకర్ అడుగు జాడల్లోనే రాష్ట్రాన్ని సాధించినట్టు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, స్వరాష్ట్ర ప్రగతిలోనూ జయశంకర్ అందించిన స్ఫూర్తిని కొనసాగించినట్టు తెలిపారు. సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తొలిదశ నుంచి మలి దశ ఉద్యమం వరకు తెలంగాణ సాధన దిశగా జయశంకర్ చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు ఉద్యమంలో ఆయన అందించిన అచంచల పోరాట స్ఫూర్తి అజరామరమైనదని కేసీఆర్ కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి వరకు శాంతియుత పద్దతిలో, పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించి, అరవై ఏండ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సాధన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితోనే కొనసాగించామని తెలిపారు. పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ తెలిపారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, సకల జనులను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన బీఆర్‌ఎస్ పాలన అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణను మరింతగా ప్రగతి పథంలో నడిపేలా కృషి చేయడమే వారికందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.