18న రాష్ట్ర క్యాబినెట్‌

– పునర్విభజన సమస్యలపై చర్చించి తగు నిర్ణయం
– జూన్‌ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం
– షెడ్యూల్‌ 9,10లో సంస్థల పంచాయతీపై ఆరా
– ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌
రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 18న జనగనుంది. ఆ సమావేశంలో పునర్విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్‌ 2 నాటికి రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు మొదలుకుని ఆస్తులు, అప్పుల పంపిణీ వరకు పెండింగ్‌ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ, విద్యుత్తు సంస్థల బకాయిలు తదితర అంశాలపై ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి చిన్న చిన్న అంశాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పీఠముడి ఉన్న అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జూన్‌ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనున్న నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనాలను అధీనంలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

Spread the love