– కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం రూ. పది లక్షలు ఇవ్వాలనీ, దంపతుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 29న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరగనున్నదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించినట్టు తెలిపారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం కుల, మతాంతర వివాహం చేసుకున్న దంపతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కుల నిర్మూలనలో కులాంతర వివాహాలు మొదటి మెట్టు లాగా ఉపయోగపడతాయని తెలిపారు. కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలనీ, వారి రక్షణ కోసం ఉన్న అనేక జీవోలు అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల గణన చేపడుతున్న సందర్భంలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారి గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. సదస్సులో ముఖ్య అతిథిదిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి, మాజీ జస్టిస్ చంద్రకుమార్ ఇతర ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.