రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

– ఆర్టీసీని పరిరక్షించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– లేకుంటే భవిష్యత్‌ పరిణామాలకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలి
– కేంద్ర దుర్మార్గ విధాన నిర్ణయాలను విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– ప్రభుత్వరంగంలోనే ఆర్టీసీ ఉంటుందని అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లో ప్రకటించాలి :
టీఎస్‌ఆర్టీసీ జేఏసీ రౌండ్‌టేబుల్‌లో రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలహెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్న టీఎస్‌ఆర్టీసీని పరిరక్షిస్తూ, కార్మికుల పెండింగ్‌ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించాలని పలు రాజకీయపార్టీలు, కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అరిగోస పడుతున్న ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచే వారికే మద్దతుగా ఉంటాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తామని అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించాలని స్పష్టం చేశారు. టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు-ఆర్టీసీ, కార్మికుల స్థితి’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి (టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ కార్యదర్శి ఎన్‌ బాలమల్లేష్‌, ఎమ్‌సీపీఐ (యూ) నాయకులు అనిల్‌కుమార్‌, ఆప్‌ కన్వీనర్‌ డాక్టర్‌ డీ సుధాకర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌ నర్సింహా, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఆర్‌ జనార్థన్‌, ఆవ్‌ బహుజన ఎంప్లాయీస్‌ ఉపాధ్యక్షులు సదన్‌తేజ్‌, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వీఎస్‌ బోస్‌ తదితరులు మాట్లాడారు. అంతకుముందు జేఏసీ కో కన్వీనర్‌ కత్తుల యాదయ్య (బహుజన వర్కర్స్‌ యూనియన్‌) ఆహ్వానం పలికారు. జేఏసీ కన్వీనర్‌ వీఎస్‌ రావు (టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌) సమావేశంలో ఆర్టీసీ స్థితిగతులు, కార్మికుల సమస్యలపై సవివర నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా రవాణాను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంపై ప్రజల్లో జరగాల్సినంత చర్చ జరగట్లేదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీలను పూర్తిగా ధ్వంసం చేస్తూ, కార్పొరేట్‌ రవాణా సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని వివరించారు. ఆర్టీసీల్లోకి వస్తున్న ప్రయివేటు అద్దె ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రవేశం కూడా దానిలో భాగమేనని తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల్ని కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయనీ, అయితే వాటిని ఆర్టీసీలే కొనుగోలు చేసేలా చట్టాలను మార్చాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు ఆర్టీసీలకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ చెల్లింపులపై మినహాయింపులు ఉన్నాయనీ, సంస్థ క్లెయిమ్స్‌ ఏడాదికి రూ.60 కోట్లు దాటబోవని తెలిపారు. ఇప్పుడు ఏటా దాదాపు రూ.380 కోట్లను ఆర్టీసీలు థర్డ్‌పార్టీ ప్రీమియం చెల్లించాలని కేంద్రం ఆదేశిస్తున్నదనీ, ఇది కార్పొరేట్‌ బీమా సంస్థలకు ప్రజల సొమ్మును దోచిపెట్టడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. కేంద్రం పెంచిన డీజిల్‌ ధరలు ఆర్టీసీలను ఆర్థికంగా కుంగిపోయేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో సంస్థ పరిరక్షణ, విస్తరణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి, వారిని చర్చలకు పిలవాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాబలంతో ఆర్టీసీలో మరో కార్మికోద్యమం తప్పదనీ, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ మేరకు సీఎంకు లేఖ రాస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ఆర్టీసీ విధ్వంసం, ప్రజలకు జరిగే నష్టంపై ప్రజాక్షేత్రంలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.

Spread the love