– కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపం
– ప్రజల పక్షాన కొట్లాడటం మా బాధ్యత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్రను చేపడతానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.తారక రామారావు తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన శాపంగా మారిందంటూ ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ గురువారం నెటిజన్లతో సంభాషించారు. కాంగ్రెస్ పాలన, ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, సీఎం రేవంత్ వ్యవహారశైలి, ప్రతిపక్షాలపట్ల సర్కారు వైఖరి తదితరాంశాలపై నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన ఈ సందర్భంగా సమాధానాలిచ్చారు. రేవంత్ సర్కార్ అబద్ధాలు, అసత్యాలతో కాలం వెళ్లబుచ్చుతోందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్‌ఎస్‌పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఆయన పాలన ఫ్రమ్ ఢిల్లీ, టు ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్టుగా తయారైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలూ తిరోగమనంలో ఉన్నాయని విశదీకరించారు. ఈ క్రమంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడటమే తమ బాధ్యతని తెలిపారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలుతోపాటు అది తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లోని డొల్లతనంపైనా పోరాడుతామని చెప్పారు. రాజకీయాల్లోకి నేతల కుటుంబ సభ్యులను లాగటం దారుణమని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. సీఎం రేవంత్ నీచ రాజకీయాల్లోకి తన కుటుంబాన్ని లాగటం శోచనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రిపైనా, ఆయన వందిమాగదులపైనా పోరాడి తీరతామని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా సీఎంతోపాటు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కుంభకోణాలకు, అవినీతికి పాల్పడబోతున్నారని ఆరోపించారు. ఇది దేశంలోనే అతి పెద్ద స్కామ్ కాబోతోందని హెచ్చరించారు. హైడ్రా అనేది కేవలం కొంతమంది కోసమే ఉద్దేశించిందని విమర్శించారు. ఆ సంస్థ కొనసాగిస్తున్న కూల్చివేతల వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ అనే పేరు నిలిచే ఉంటుందని కేటీఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారని వివరించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని చెప్పారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మన దేశంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది సాధ్యం కాదన్నారు.
గాలి మాటలతో అసలుకే మోసం
ఖర్గేకు చురకలు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి మాటలతో అనేక గ్యారెంటీలిస్తే, ఇప్పుడు ఆ పార్టీకి మొదటికే మోసం వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి ట్విట్టర్‌లో చురకలంటించారు. ఆ రాష్ట్రంలో అనేక హామీలు గుప్పించినప్పుడు అక్కడి బడ్జెట్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఆదాయం చూసుకోకుండా హామీలిస్తే ఆర్థిక సంక్షోభం తప్పదనే విషయం బోధపడిందా ఖర్గే గారూ..? అంటూ ఎద్దేవా చేశారు.