– ఉద్యోగ జేఏసీ చైర్మెన్ జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, అడిషనల్ కలెక్టర్ లింగయ్య నాయక్, కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ సీసీ నరేందర్, ఇతర సిబ్బంది మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. ఈ దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు వారు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగ జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దోషులను బేషరతుగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలనీ, బోజన విరామ సమయంలో నిరసన చేపట్టాలని చెప్పారు. దోషులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలని అన్నారు. జిల్లా అత్యున్నత అధికారైన కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఇతర అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన దాడి పట్ల ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకునే మార్గం చూడాలి తప్ప, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని విధులు నిర్వహిస్తున్న అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. సమాజంలో ఇలాంటి చర్యలను పౌర సమాజం, రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే భవిష్యత్తులో 10 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు నాయకత్వం వహించే 206 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో ఉన్న ఉద్యోగుల జేఏసీ తగు ఉద్యమ కార్యచరణకు పిలుపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమాలు కొత్త కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ కోచైర్మెన్లు చావ రవి, వంగ రవీందర్‌రెడ్డి, నాగిరెడ్డి, జి జ్ఞానేశ్వర్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్స్ ఎస్‌ఎం ముజీబ్ హుస్సేనీ, ఎ.సత్యనారాయణ, నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, కె వెంకటేశ్వర్లు, బి శ్యామ్, ముత్యాల సత్యనారాయణగౌడ్, గంగాధర్, గోల్కొండ సతీశ్, లక్ష్మణ్, కె శ్రీకాంత్, హరికృష్ణ, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.