ముందడుగు

step forwardమానవ జీవితంలో డిజిటల్‌ సాంకేతికత ప్రతి అంశానికీ విస్తరించింది. ప్రతి మూలనూ స్పృశిస్తోంది. మన దైనందిన జీవితానికి సాంకేతికత కీలకంగా మారింది. కంప్యూటర్లకు శక్తినిచ్చే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి… స్మార్ట్‌ఫోన్‌లలోని యాప్‌ల వరకూ-సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతే మన దైనందిన చర్యలను నిర్వచిస్తోంది. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ కానీ, యాప్‌ కానీ మన అవసరాలకనుగుణంగా పనిచేస్తోందంటే… అందుకు అవసరమైన సోర్స్‌కోడ్‌ ఆ సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. ఇది చాలామంది కంప్యూటర్‌ వినియోగదారులకు తెలియని, చూడని సాఫ్ట్‌వేర్‌ భాగం. ఒక ప్రోగ్రాం ఎలా పనిచేస్తుందో, ఎలా పనిచేయాలో నిర్దేశించగల కోడ్‌ ఇది. మానవ మేధస్సు సృష్టించిన అద్భుత పరిజ్ఞానం. ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్‌లో సోర్స్‌కోడ్‌పై గుత్తాధిపత్యం యజమానికే ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంపై దశాబ్దాలుగా కొందరి గుత్తాధిపత్యం కొనసాగుతూ వస్తోంది. డిజిటల్‌ సాంకేతికత మనిషి జీవితంలోకి చొచ్చుకొచ్చిన తర్వాత… ఈ గుత్తాధిపత్యం నుంచి బయటపడాలనే భావన మొలకెత్తింది. అలా మొలకెత్తిన అంకురమే ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ భావన. ‘శాస్త్రం నీ అస్త్రం/ మౌనం శ్మశానం/ అది కాదు జ్ఞానం/ పరీక్షించు సహేతుకంగా/ ప్రసంగించు సాధికారంగా/ సమిష్టి సూత్రం సరైన విధానం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌… సాంకేతిక పురోగతి, వినియోగదారు సాధికారత, సామాజిక సమానత్వానికి మూలస్తంభం.
డబ్బు ఖర్చు చేయకుండా ఉచితంగా లభ్యమయ్యే సాఫ్ట్‌వేర్‌ మాత్రమేకాక… స్వేచ్ఛ అనే భావన చుట్టూ తిరిగే తత్వశాస్త్రం. ‘ఏదైనా ప్రయోజనం కోసం ప్రోగ్రామ్‌ను అమలు చేసే స్వేచ్ఛ, ఆ ప్రోగ్రామ్‌ ఎలా పనిచేస్తున్నదో అధ్యయనం చేసే స్వేచ్ఛ, మన అవసరాలకు తగినట్లుగా మార్చుకునే స్వేచ్ఛ, ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎవరికైనా పునఃపంపిణీ చేయగల స్వేచ్ఛ’ ఉండాలని ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ స్టాల్‌మాన్‌ చెబుతారు. ఈ భావన సోర్స్‌ కోడ్‌ను వీక్షించడానికి, సవరించడానికి ఎవరినైనా అనుమతించడం ద్వారా, అప్పటివరకూ సాఫ్ట్‌వేర్‌పై ఉన్న యాజమాన్య హక్కు సమస్యకు సృజనాత్మక పరిష్కారాన్ని చూపడానికి అవసరమైన భూమికను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ సృష్టించింది. లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, వెబ్‌ సర్వర్లు, ఆండ్రాయిడ్‌ పరికరాలు, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, జింప్‌, స్క్రైబస్‌ వంటి అనేక సాఫ్ట్‌వేర్లకు ఈ సాంకేతికతే ఆధారం. ఈ సాంకేతికత ఆధారంగానే కేరళ ‘ఉచిత సాఫ్ట్‌వేర్‌లో ఛాంపియన్‌’గా నిలిచింది. అంతర్జాతీయ మోడల్‌గా ‘స్కూల్‌వికీ’ అనే పోర్టల్‌ను తీర్చిదిద్ది, ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో దేశంలోనే ముందంజలో ఉందని యునెస్కోచే ప్రశంసలు పొందింది. కేరళ విద్యారంగంలో ఉచిత సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా సాంప్రదాయ సాఫ్ట్‌వేర్‌ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. ‘ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ప్రజాస్వామ్యం వైపు ఒక పెద్ద అడుగు. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరినైనా అనుమతిస్తుంది’ అంటారు ఫ్రీసాఫ్ట్‌వేర్‌కి చెందిన పీటర్‌ బ్రౌన్‌. ఈ భావన సాధ్యమేనని కేరళ ఆచరణలో చూపింది. కేంద్రంతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ కేరళ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి. గుత్తాధిపత్య సాఫ్ట్‌వేర్ల ప్రభావం నుంచి బయటపడాలి.
కంప్యూటింగ్‌ సంస్కృతి నుండి ఉత్పన్నమయ్యే అత్యంత విజయవంతమైన సామాజిక ఉద్యమాలలో ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఒకటి. ఆధునిక సాంకేతికత, స్వేచ్ఛ, ఆవిష్కరణను సమర్థించేలా ఉచిత సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చెందింది. అది డిజిటల్‌ యుగంలో మనం పాటించే విలువలకు ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన, సేవాతత్పరులైన ఎందరో ప్రోగ్రామర్ల మేధస్సుతో నడపబడుతోంది. ‘మెదడన్నది మనకున్నది/ అది సరిగా పనిజేస్తే/ విశ్వరహః పేటికా వి/ పాటన జరగక తప్పదు’ అంటాడు శ్రీశ్రీ. ఒక్కమాటలో చెప్పాలంటే- వినియోగదార్లను చైతన్యం చేయడం, సాఫ్ట్‌వేర్‌పై కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడంపై ఉచిత సాఫ్ట్‌వేర్‌ విజయం ఆధారపడి ఉంటుంది.

 

Spread the love