సెమీస్‌లో అడుగు!

ొ సూపర్‌8లో వరుసగా రెండో విక్టరీ ొ బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం ొ కుల్దీప్‌ మాయ, బుమ్రా బూమ్‌ బూమ్‌ొ హార్దిక్‌ పాండ్య అజేయ అర్థ సెంచరీ భారత్‌ 196/5, బంగ్లాదేశ్‌ 146/8– సూపర్‌8లో వరుసగా రెండో విక్టరీ
– బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

– కుల్దీప్‌ మాయ, బుమ్రా బూమ్‌ బూమ్‌
– హార్దిక్‌ పాండ్య అజేయ అర్థ సెంచరీ

– భారత్‌ 196/5, బంగ్లాదేశ్‌ 146/8
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకుంది!. సూపర్‌8 దశలో వరుసగా రెండో విజయం సాధించిన భారత్‌ సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీకి తోడు పంత్‌, దూబె, కోహ్లి సైతం మెరువగా వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో టీమ్‌ ఇండియా అత్యధిక స్కోరు 196/5 సాధించింది. 197 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్‌ చేతులెత్తేసింది. కుల్దీప్‌ యాదవ్‌ (3/19) మాయ, జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/13) బూమ్‌బూమ్‌ ముంగిట బంగ్లాదేశ్‌ బ్యాటర్లు తేలిపోయారు. 50 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

నవతెలంగాణ-నార్త్‌సౌండ్‌
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురులేదు. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన రోహిత్‌సేన.. సూపర్‌8లోనూ వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. శనివారం జరిగిన సూపర్‌8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్‌8లో చివరి మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది!. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/19), పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/13) మ్యాజిక్‌తో 197 పరుగుల రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్‌ చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసింది. కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (40, 32 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), తంజిద్‌ హసన్‌ (29, 31 బంతుల్లో 4 ఫోర్లు), రిషద్‌ (24, 10 బంతుల్ల 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) ఆశల్లేని మ్యాచ్‌లో ఓ ప్రయత్నం చేశారు. అంతకుముందు, హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌, 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. విరాట్‌ కోహ్లి (37, 28 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), రిషబ్‌ పంత్‌ (36, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా శివం దూబె (34, 24 బంతుల్లో 3 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేయగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ గ్రౌండ్‌లో జరిగిన టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు కావటం విశేషం. హార్దిక్‌ పాండ్య ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
కలిసికట్టుగా కొట్టారు : టాస్‌ నెగ్గిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (23, 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ దూకుడు ప్రదర్శించాడు. కోహ్లి (37) నెమ్మదిగా ఆడినా రోహిత్‌ దూకుడుతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. షకిబ్‌ ఓవర్లో భారీ షాట్‌కు వెళ్లిన రోహిత్‌ నిష్క్రమించినా.. రిషబ్‌ పంత్‌ (36) తోడుగా కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ 27 బంతుల్లో 32 పరుగులు నమోదు చేసింది. అప్పటికే మూడు సిక్సర్లు బాదిన ఉత్సాహంలో హసన్‌ షకిబ్‌ ఓవర్లో క్రీజు వదిలొచ్చిన కోహ్లి వికెట్లను కోల్పోయాడు. అదే ఓవర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (6) సైతం అవుటయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌లో వేగం కాస్త మందగించింది. అయినా, పంత్‌ సహజశైలిలో రెచ్చిపోయాడు. విలక్షణ షాట్లతో పరుగులు పిండుకున్నాడు. రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో అలరించినా.. రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న శివం దూబె (34) స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. మూడు సిక్సర్లతో చెలరేగాడు. ఇక ఇన్నింగ్స్‌కు వైస్‌ కెప్టెన్‌కు హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌) అదిరే ముగింపు అందించాడు. 180 పరుగులు చేసేలా కనిపించిన భారత్‌కు 196 పరుగుల భారీ స్కోరు అందించాడు. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ వేసిన చివరి ఓవర్లో బౌండరీల మోత మోగించిన పాండ్య 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అక్షర్‌ పటేల్‌ (3 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
కుల్దీప్‌, బుమ్రా మ్యాజిక్‌ : 197 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్‌ తేలిపోయింది. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (13), హసన్‌ (29) తొలి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం అందించినా.. ఏ దశలోనూ బంగ్లాదేశ్‌ లక్ష్యం దిశగా సాగలేదు. హార్దిక్‌ పాండ్య పవర్‌ప్లేలో భారత్‌కు తొలి బ్రేక్‌ అందించగా.. మిడిల్‌ ఓవర్లలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాయ చేశాడు. హసన్‌, తౌహిద్‌ హృదరు (4), షకిబ్‌ అల్‌ హసన్‌ (11) వికెట్లతో బంగ్లాదేశ్‌ ఆశలను ఆవిరి చేశాడు. బుమ్రా పదునైన పేస్‌ను ఎదుర్కొనేందుకు బంగ్లా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగిన తరుణంలో కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (40) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి మరో బ్యాటర్‌ నుంచి సహకారం దక్కలేదు. ఆఖర్లో టెయిలెండర్‌ రిషద్‌ (24) ఓటమి అంతరాన్ని కుదించాడు. బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌లు రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు బంగ్లాదేశ్‌ 146 పరుగులే చేసింది. 50 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

Spread the love