– సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం
– గ్రామాల్లో, పట్టణాల్లో సందడి వాతావరణం
– కొన్ని చోట్ల సమాచారమూ సేకరణ
– ప్రారంభించిన మంత్రులు, కలెక్టర్లు
– అనుమానాలు అక్కర్లేదు
– ఆదిలాబాద్‌లో అధికారులకు షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి రోజు బుధవారం ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. 9వ తేదీ నుంచి సమగ్ర సమాచారం సేకరించనున్నారు. 75 ప్రశ్నలతో 80వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. దాంతో గ్రామాలు, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ప్రజల నుంచి సామాజిక, ఆర్థిక వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నెలరోజుల్లో సర్వే పూర్తవుతుంది. కాగా, కొన్నిచోట్ల స్టిక్కర్లు అంటించిన వెంటనే సమాచారం సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వేను కొన్ని చోట్ల మంత్రులు, మరికొన్ని చోట్ల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రణాళిక కోసం సర్వే చేపట్టినట్టు మంత్రులు తెలిపారు. రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ లాంటి ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారం అవాస్తవని అన్నారు. ఆధార్ ప్రామాణికం కాదన్నారు. ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు.హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో శ్రీధర్‌బాబు ప్రారంభించారు. హైదరాబాద్‌లో మొదటి రోజు ఇంటింటికీ స్టిక్కర్‌లు వేశారు. జూబ్లిహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి అధికారులు స్టిక్కర్ అంటించారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సర్వేను పరిశీలించారు. మొత్తంగా మొదటి రోజు సర్వే ప్రశాంతంగా జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని రాంపల్లి దాయర, గోధుమకుంటలో సర్వేను కలెక్టర్ గౌతం, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముందుగా గుర్తింపు చేసిన గృహాలకు స్టిక్కర్లు వేస్తున్నారు. సాయంత్రం అధికారులు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఎన్యూమరేటర్ ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారాలు సేకరిస్తున్నారు. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. అటవీ, దేవాదాయ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు కొండ సురేఖ, దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి పట్టణం, చిట్కూల్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలో సర్వేను అధికారులు తనిఖీ చేశారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్యునరేటర్ సేకరిస్తున్న వివరాలను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కలెక్టర్ పరిశీలించారు. ఫారం నింపే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ కోరారు. నల్లగొండలో సర్వేను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు.
సర్వే నిర్వహణలో లోపాలపై కలెక్టర్ ఆగ్రహం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సర్వేను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. గెర్జం గ్రామంలో ఇండ్ల జాబితా సర్వే సరిగా నిర్వహించకపోవడం, స్టిక్కర్లపై సరైన వివరాలు నమోదు చేయకపోవడం, సర్వేకు సంబంధించి మ్యాప్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సర్వే నిర్వహించాలో ముందుగా నిర్ధారించకపోవడం, సర్వేలో తప్పులు నమోదు చేయడంతో ఎంపీడీఓ లక్ష్మణ్, ఏఓ కైలాస్, పంచాయతీ సెక్రటరీ సయ్యద్ ఏజాజ్ హస్మికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.