నగ దేహం చుట్టూ
దేశం తీతువై పరిభ్రమిస్తోంది
ఆ దుశ్చర్యను గాంచి
ప్రకృతి శోకం ఆకాశం చిల్లులు పడ్డట్టు
భీకరవానయై కురుస్తోంది..
ఆ దేహం చుట్టే కోటానుకోట్ల
ఆలోచనలు భ్రమరాలై
మరెన్నో అభిప్రాయభ్రమలు విభ్రమలై
దిగ్భ్రాంతికి లోనై చుట్టేస్తున్నాయి..
ఆమె పెట్టిన భీకర గావుకేకలు
భీతావహ దృక్కుల చూపులు
నలుదిక్కుల్ని పిక్కటిల్లేలా చేస్తే
కొందరు వాటిని సైతం
వివక్షలత్రాసులో తూకమేస్తున్నారు..
ఎపుడు అదే దృశ్యం నా కళ్ళ
ముందర నగంగా వేలాడుతుంది
ఎమిచేయలేని నిస్సహాయత
ఊరిచివర మర్రిచెట్టుపై
గబ్బిలమై వేలాడుతుంది..
ఇపుడు
దాన్ని ఆపడానికి ఎవరు రారు
నిను రక్షించడానికి కూడా
ఏ ఒక్కరు సాహసించరు
ఎందుకంటే..
జాతుల జాఢ్యాలు మూడులై
దుర్మార్గపు బాటపై కవాతు చేస్తుంటే
మతమౌడ్య మబ్బులు
చుట్టూరా మమ్మల్ని కమ్మేశాయి..
తెగలమధ్య పుట్టిన తెగులు
మాలోని పచ్చదనాన్ని చంపేశాయి
కులాల కత్తులు మాట్లాడే మా
నాలికల్ని తెగ్గొట్టేశాయి
– సర్ఫరాజ్ అన్వర్, 9440981198