నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. దీంతో ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. తర్వాత కోలుకున్నప్పటికీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 18,750 ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.10గా ఉంది. ఉదయం 63,115 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 63,013 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కోలుకుని 63,274 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరికి 85 పాయింట్ల లాభంతో 63,228 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 39.70 పాయింట్ల లాభంతో 18,755.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంక్, ఐటీ రంగ షేర్లు మినహా మిగిలిన రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.