ఓడరేవుల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలు

 Stockpiles of rice at ports– ఎగుమతులపై నిషేధమే కారణం
న్యూఢిల్లీ : దేశంలోని ఓడరేవుల వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ప్రస్తుతం ఓడరేవుల వద్ద రెండు లక్షల టన్నుల బియ్యం నిలిచి ఉంది. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం గత నెల 20న బాసుమతి యేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం కారణంగా బియ్యం ఎగుమతులకు కస్టమ్స్‌ అనుమతులు నిలిచిపోయాయి. అప్పటికే కస్టమ్స్‌ అనుమతులు పొందిన సరుకును ఓడల్లోకి ఎక్కించి పంపించారు. తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ 20వ తేదీ సాయంత్రం నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత సరకు రవాణాను ఆపేశారు. దీంతో రెండు లక్షల టన్నుల బియ్యం ఇప్పటికీ ఓడరేవుల్లోనే నిలిచి ఉంది. కొల్‌కతాలోని శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవులో ఐదు వేల టన్నుల బియ్యం నిల్వ ఉంది. బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడంతో ప్రపంచ ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగిందని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త పయరీ-అలివియర్‌ గౌరించాస్‌ చెప్పారు. భారత్‌ నిర్ణయం కారణంగా బియ్యం ధరలు ఈ సంవత్సరం 10-15 శాతం పెరగవచ్చునని తెలిపారు.

Spread the love