– కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు
– మధ్యంతర ఆదేశాలు వద్దు : దిగువ కోర్టులకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ప్రార్థనా స్థలాల యాజమాన్యం, హక్కులను సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను స్వీకరించవద్దని సుప్రీంకోర్టు గురువారం దేశంలోని న్యాయస్థానాలన్నింటినీ ఆదేశించింది. ‘తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ కొత్తగా వ్యాజ్యాలు నమోదు చేయవద్దు. ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దు. ఇప్పటికే పెండింగులో ఉన్న పిటిషన్లకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది ఆదేశాలు ఇవ్వకూడదు. సర్వేలు జరపాల్సిందిగా ఆదేశించకూడదు’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వారణాసిలోని జ్ఞానవాపి వివాదం, మధురలోని కృష్ణ జన్మభూమి వివాదం సహా పలు ప్రార్థనా స్థలాలకు కూడా వర్తిస్తాయి. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ దేశంలోని కనీసం పది కోర్టుల్లో వ్యాజ్యాలు పెండింగులో ఉన్నాయని కోర్టు దృష్టికి వచ్చింది. 1991వ సంవత్సరపు ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు రిట్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో జస్టిస్ సంజరు కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన త్రిసభ్య బెంచ్ విచారిస్తున్న విషయం తెలిసిందే. ‘ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉంది. చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4ను పరిశీలించాలని మేము అంటుంటే ఇతర కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయి? ఈ కేసు మా ఎదుట పెండింగులో ఉండగా, దానిని మేము పరిశీలిస్తున్న సమయంలో ఏ ఇతర కోర్టు అయినా దానిని చేపట్టడం సమంజసం, న్యాయసమ్మతం అవుతుందా?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టం పరిధిని తాము పరిశీలిస్తున్నామని, ఈ దశలో సర్వే నిర్వహించడం సహా ఎలాంటి తుది ఆదేశాలు జారీ చేయరాదని ఆయన స్పష్టం చేశారు. తదుపరి విచారణ తేదీ వరకూ మధ్యంతర లేదా తుది ఆదేశాలు జారీ చేయవద్దని నిర్దేశించారు. కొన్ని సూత్రాలను నిర్దేశిస్తూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలులో ఉన్నప్పుడు సివిల్ కోర్టులు సుప్రీంకోర్టుతో పోటీ పడకూడదని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాధన్ వ్యాఖ్యానించారు. కాగా వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న 18 కేసుల విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిచిపోతుంది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం తీసుకోకుండా ఎలాంటి నిర్ణయానికి రాలేమని తెలిపింది. 1947 ఆగస్ట్ 15వ తేదీ తర్వాత ప్రార్థనా స్థలాల మత స్వభావంలో మార్పులు చేయడాన్ని 1991వ సంవత్సరపు చట్టం నిషేధిస్తోంది. మొఘలుల పాలనలో అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని హిందూత్వ వాదులు ఆరోపించారు. ఆయా ప్రదేశాలను తిరిగి హిందూ సంస్థలకు అప్పగించాలంటూ పలు కోర్టుల్లో వారు పిటిషన్లు దాఖలు చేశారు.