జైలుజీవిత వ్యధార్థ గాథలు

జైలుజీవిత వ్యధార్థ గాథలువిభజించి పాలిస్తే రాజ్యానికి అభయం. సంఘటితమైతే రాజ్యానికి భయం. రాజ్యానికి భయమేస్తే రాజ్య ద్రోహం అవుతుంది. ఆ సంఘటితం చేసే వారిని రాజ్యద్రోహం కింద ఉపా లాంటి చట్టాల పేరుతో నిర్బంధిస్తుంది. అలా నిర్బంధించిన మానవ హక్కుల న్యాయవాదే సుధా భరద్వాజ్‌. భీమా కొరెగావ్‌లో హింసను ప్రేరేపించారు అనే కల్పిత అభియోగం మోపబడి ఉపా చట్టం కింద 2018 అక్టోబర్‌లో అరెస్టు చేయబడ్డారు. మూడేళ్ళ పాటు మహారాష్ట్రలో పూణేలోని ఎరవాడ జైల్లో, ముంబైలోని బైకుల్లా జైల్లో నిర్బంధించిన తర్వాత 2021 డిసెంబర్‌ 1న కొన్ని షరతులతో బెయిల్‌పై విడుదలయ్యారు. ఉరి వార్డులో నిర్బంధించిన ఆ కాలంలో తాను గమనించిన జైలు జీవిత యదార్ధ గాథానుభవాల రూపమే ఈ ‘ఉరి వార్డు నుండి’ పుస్తకం.
భారతదేశంలో సామాన్యుల కోసం పనిచేయడానికి అమెరికా దేశ పౌరసత్వాన్ని వదులుకున్న సుధా గారు దానికన్నా తాను పనిచేస్తున్న కార్మిక వర్గ నమ్మకం పొంది, వారిని వదలకుండా ఉండగలగటం గొప్ప ప్రధానమైన అంశమని మొదట్లో పొందుపరచి ఉన్న తన ఇంటర్వ్యూలో అంటారు. జైలులో ఓ మావోయిస్టు మహిళగా పరిచయం చేయబడ్డ సుధా భరద్వాజ్‌, జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలను నేరస్థులుగా కాకుండా మానవులుగా మనకు చూపుతారు. ఒక పక్క బయటి ప్రపంచంతో సంబంధాలు లేక మదన పడుతున్న సమయంలో ఆ జైలు ప్రపంచంలో ఎన్నో మానవ సంబంధాలు, స్నేహాలు, ఆప్యాయతలు ఉండే మరో ప్రపంచాన్ని పాఠకులకు చూపిస్తారు. ప్రముఖ వార్తలను కత్తిరించిన రంధ్రాల వార్తాపత్రికలను చదువుతూ 370 ఆర్టికల్‌ రద్దు, గురించి పౌర సవరణ చట్టం గురించి, వాటిపై జరుగుతున్న ప్రజాందోళనలకు దూరంగా ఉండవలసి వచ్చిందే అనే బాధతో సతమతమవుతున్న ఈ ప్రజా ఉద్యమకారిణి జైలు ఊచల వెనుక నుండి జైల్లో మగ్గుతున్న వారి కన్నీళ్ళకు, ఆర్తనాదాలకు, శాపాలకు, కోపాలకు, చాడీలకు, మౌనాలకు, గుడ్డి ప్రేమలకు, అహంకారాలకు, శ్రమలకు, భ్రమలకు, వివక్షతలకు, ఓర్పులకు, అరాచకత్వాలకు, అమాయకత్వాలకు అక్షర రూపం దాల్చారు. 77 రకాల కేసులు వెనుకనున్న నేరాల సందర్భాలను, సాధ్యాసాధ్యాలను, సంకోచిస్తూ ఆశ్చర్యపోతూ, ప్రశ్నలు సంధిస్తూ మమ్మల్ని కూడా ఆలోచింపచేస్తారు. తనను ఎందుకు అరెస్ట్‌ చేశారో తనకే తెలియని పరిస్థితి నుండి జైల్లో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తున్న అనేకమందిని ఎందుకు అరెస్ట్‌ చేశారో అన్న అనుమానాన్ని మనకు రేకెత్తిస్తారు.
ప్రేమికుల మాయ మాటల్లో పడి భర్తను చంపిన స్త్రీలు, లేదా ప్రేమికుని భార్యను హతమార్చిన కేసులు, భర్తతో సంబంధం గల స్త్రీతో ఏర్పడ్డ అగాధంతో భర్త ఆమెను చంపి సవితి పేరుతో భార్యే చంపింది అనీ తల్లి, భార్య మీద పెట్టి నేరం నుండి తప్పించుకోవడం, కొడుకు- కోడలు మధ్య తగాదాలతో కోడలు ఆత్మహత్య చేసుకున్నందుకు అత్తను శిక్షించడం, కోడలు అనుమానాస్పదంగా మృతి చెందితే ఇంట్లోనే ఉంది కదా అని కేవలం అత్త మీద కేసు పెట్టడం, పచ్చి బాలింతయిన స్త్రీ భర్త లైంగిక కోరికలు తీర్చనందుకు తను రాకపోతే తన ఎనిమిదేళ్ల బిడ్డను పంపమని అంటే కోపావేశాలకు లోనైన భర్తను చంపిన స్త్రీలు… ఇలా అనేకరకాల కేసులు అనేకరకాల పార్శ్వాలు.
ఇలాంటి స్త్రీలపై ఆధారపడ్డ ముసలి వాళ్లు, మతిస్థిమితం లేని బిడ్డలు వారి పరిస్థితి వారి బాధలు. వారితోనే శిక్షలో పాలుపంచుకుంటూ ఆరేళ్ల లోపు బిడ్డలు. ఈ జైలు వాతావరణంలో ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటారు? అక్కడ మాట్లాడే మాటలు తిట్లు సునాయాసంగా నేర్చేస్తారు అంటూ,ఈ బిడ్డలను తండ్రులు చూడలేరు అని పితృస్వామిక సమాజంలో ఉన్న న్యాయ వ్యవస్థ కూడా అనుకుంటున్నదే అన్న ఆలోచన కూడా సుధా సంధించారు.
జైల్లో ఆహారం సేకరించడం, బట్ట లారేయడం, వాడుకోటానికి నీళ్ల సేకరణ, బహిష్టు సమయాల్లోని సమస్యలు, ఫ్యాన్‌ సౌకర్యం కోసం పడ్డ పాట్లు, అగచాట్లు అనేకాలతో పాటు అప్పుడప్పుడు పండుగల సందర్భాలలో లేదా మహిళా హక్కుల గురించి ఏమాత్రం ఊసేలేని మహిళా దినోత్సవాల సందర్భాలలో దొరికే పలకరింపులు, నవ్వులు, స్నేహాలు చలోక్తుల గురించి చెబుతారు. అదే సందర్భంలో జైలు సిబ్బందికి కలిగే ఇబ్బంది కూడా చూపుతారు. అంచనా వేయలేని సామూహిక శక్తితో కూడిన అవ్యక్త భయం గురించి సుధా చెప్తుంటే సామూహిక శక్తి గురించి రాజ్యానికే భయమేస్తే ఇక జైల్లో సిబ్బందికి ఎందుకు భయముండదు అనిపిస్తుంది. అందుకే నియంత్రణలు, నిర్బంధాలు. మత ప్రసంగాలకు విచ్చలవిడిగా అనుమతినిచ్చే జైలు తక్కువ వేతనం చెల్లించి అనేక ఉత్పత్తులను తయారుచేసే ఖైదు పరిశ్రమల ద్వారా దోపిడీ కూడా విచ్చలవిడిగానే సాగిస్తుంది. ఒకపక్క కుటుంబం అనే జైలు కన్నా ఈ జైలు నయం కదా అని లింగ వివక్ష ఆలోచింప చేస్తుంటే, మరో పక్క జైలు శుభ్రం చేసే పని కేటాయింపు కులాన్ని బట్టి ఉంటుంది అంటే, ఒకే లింగంలో కుల వివక్షత లాంటి దిగ్భ్రాంతికర కోణాలు రచయిత చూపుతారు.
తమ కేసు ఎవరు వాదిస్తున్నారో, తదుపరి విచారణ ఎప్పుడో తెలియని ఈ అమాయక నేరస్తులకు ఎర్రవాడ జైలులో కనీసం వైద్యం అయినా సకాలంలో అందుతుంది అంటారు. తల్లి ఖైదీ ఒకసారి పిల్లలతో ప్రవర్తించే తీరును చూసి ఎప్పుడూ అనుభవించని దానిని ఆమె మాత్రం ఎలా ఇవ్వగలదు అని అంటారు. దోషం ఎక్కడ జరిగిందో అని మమ్మల్ని కూడా ఆలోచింపజేస్తారు. విద్యాహక్కు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు, లైంగిక స్వేచ్చ లేనందున సరైన సమయంలో న్యాయం అందక, పితృ స్వామిక సమాజం తీరుతో క్షోభననుభవిస్తున్న వారు ఎరవాడ, బైకుల్లా జైళ్ళలో మాత్రమే ఉన్నారా అన్న ప్రశ్న ఈ పుస్తకం చదువుతూండగా మన మనసులో రాకపోదు. పరిమితి కన్నా మించిన ఖైదీలను జైలులో ఉంచడం వల్ల ఎన్ని గొడవలు జరిగినా ఏ నూతన సంవత్సరానికైనా, పండుగకైనా, ఏ సమీకరణకైనా, ఒకరికొకరు చెప్పుకునే శుభాకాంక్షలు మాత్రం ”మీరు తొందరగా విడుదల కావాలని కాంక్షిస్తున్నాను” అని. అందుకే జైలు లోని ఓ వేడుకలో సుధా ఇలా పాడుతారు….ఓ శుభహా కభీ తో ఆయేగి…/ ఆ ఉదయం ఎప్పటికైనా వచ్చులే…/ దేనికోసమైతే యుగయుగాలుగా/ మనమంతా చేస్తూ బ్రతుకుతున్నామో/ అమృతమయమైన ఏ ఉదయం కోసం/ విష పాతాలను తాగుతున్నామో…/ ఆ ఉదయం ఎప్పటికైనా వచ్చులే…
తాము చేయని నేరాలను తమ భర్తల కోసమో, బిడ్డల కోసమో, ప్రేమించిన వారి కోసమో నెత్తిన వేసుకుని మోస్తున్న ఈ నారీమణులకు బయట హాయిగా తిరుగుతున్న అతని చేతిలో మోసపోయాము అని తెలిసినా దేవుడు అనే అతని మీదే నమ్మకం. సుధా భరద్వాజ్‌ను మిమ్మల్ని అసమ్మతవాదులని అనవచ్చా అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, అంటే నేను రాజ్యాంగానికి లోబడి ఉండాలని నమ్ముతూ, నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా, న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రతి పౌరుడికి దక్కాలని కోరుకుంటున్నాను. అదే అసమ్మతా? అని అన్న సుధాగారి ఈ ప్రశ్న మాత్రం కచ్చితంగా పాలకులకే. హృదయవికార గాథలను ఇంత తక్కువ కాలంలో తెలుగు పాఠకులకు అందజేసిన ఉషారాణికి ధన్యవాదాలు.
ఎం.డి. షకీల బేగం

Spread the love