– ఒక విద్యార్థి సీరియస్..ఆస్పత్రికి తరలింపు..
– వాచ్మెన్ పై చర్యలు తీసుకోవాలి: ఎస్ఏప్ఐ
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
దేవర పూనకం వస్తోందని, వాచ్మెన్ విద్యార్థులను భయాందోళనకు గురి చేసిన సంఘటన కాటారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వసతి గృహంలో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్ ప్రతిరోజు అర్ధరాత్రి వింతగా ప్రవర్తించడంతో ఏడవ తరగతి చదివే మారుపాక వైష్ణవిక భయాందోళనకు గురై ప్రాణప్పయస్థితికి చేరుకొంది. సదరు నైట్ వాచ్మెన్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో విద్యార్థుల తలుపు తట్టి పూనకంలో వింత వింతగా విద్యార్థులు భయపడే విధంగా బండారు, మేకపోతులను తీసుకురండి అని మాట్లాడుతుండడంతో విద్యార్థులు భయం భయంగా రోజులు గడుపుతున్నారని సమాచారం. వాచ్మెన్ చేష్టలకు విద్యార్థులు ఎవరికి చెప్పుకోలేక రాత్రి సమయంలో హాస్టల్ అంటేనే జంకుతున్నారు. వసతి గృహ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మహముత్తారం మండలం పాత రేగుల గూడెం గ్రామానికి చెందిన మారుపాక వైష్ణవిక సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ ఏడవ తరగతి చదువుతుంది. ఆదివారం రాత్రి వాచ్మెన్ ఇలాగే ప్రవర్తించడంతో భయాందోళనకు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భూపాలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అయినా అమ్మాయి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్, రాజ్ కుమార్ వంద పడకల హాస్పిటల్ చేరుకొని విద్యార్థిని పరామర్శించారు. హాస్టల్లో జరుగుతున్న విషయం గురించి తెలుసుకున్నారు. అందుబాటులోని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారులు సంక్షేమ హాస్టల్ లపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఈ సందర్భంగా కోరారు.