నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మరణించగా, ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. తాజాగా, వయనాడ్ ప్రాంతంలో భూమి లోంచి వింత శబ్దాలు వస్తున్నాయి. వయనాడ్, పాలక్కాడ్, కోజికోడ్ ప్రాంతాల్లో భూమి లోంచి విచిత్రమైన ధ్వనులు వస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే కొండచరియలు విరిగిపడిన ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న ప్రజలు… భూమి లోంచి వస్తున్న ధ్వనులతో ఇంకేం విపత్తు సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఉదయం 10.30 సమయంలో భూమి లోంచి శబ్దాలు రావడంతో స్కూళ్లలోని విద్యార్థులు బయటికి పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భూకంపం వస్తుందేమోనంటూ ప్రచారం మొదలైంది. అయితే, సెంటర్ ఫర్ సీస్మాలజీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ శబ్దాల వల్ల ప్రమాదమేమీ లేదని, భూకంపం వస్తుందన్న భయాలు అవసరం లేదని స్పష్టం చేశాయి.