– మోడీ, జిన్‌పింగ్ అంగీకారం
– బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతల భేటీ
కజాన్: అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో, అలాగే కమ్యూకినకేషన్స్ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని భారత్, చైనా నేతలిరువురూ అంగీకరించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ బుధవారం నాడిక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జనాభా పరంగా ప్రపంచంలో రెండు అతి పెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య సంబంధాల మెరుగుదల సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే కాదు, ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందన్నారు. ప్రపంచ జనాభాలో ఈ రెండు దేశాలు 34 శాతం దాకా వాటా కలిగి ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు సంబంధించి నాలుగున్నరేేండ్లుగా ప్రతిష్టంభనను తొలగించి 2020 మే నెలకు ముందున్న స్థితిని పునరుద్ధరిస్తూ ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. తమ రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య సామరస్యపూర్వక, సుస్థిర సంబంధాలు ఈ ప్రాంతానికి, అలాగే ప్రపంచ శాంతికి చాలా అవసరమన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలను సరైన రీతిలో పరిష్కరించుకోవడానికి కృషి చేస్తూనే కమ్యూనికేషన్, సహకార బంధాన్ని మరింత బలోపేతం గావించడంపై దృష్టి పెట్టాలని జిన్‌పింగ్ మోడీని కోరారు.
2019 తరువాత ఈ ఇరువురి నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం ఇదే మొదటిసారి. చివరి సారి చెన్నైలో ఇండియా-చైనా ఇష్టాగోష్టి సమ్మిట్ జరిగింది. మొదటి ఇష్టాగోష్టి సమ్మిట్ చైనాలోని వుహాన్‌లో 2018 ఏప్రిల్‌లో జరిగింది.