నవతెలంగాణ – మల్హర్ రావు
ధాన్యం తుకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. శనివారం కాటారం మండలంలోని అంకుశ పురం గ్రామ శివారులోని అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం దామరకుంట గ్రామానికి చెందిన కొందరు రైతులు తక్కువ తూకం వేస్తున్నారని, దానివల్ల తాము నష్ట పోతున్నామని దరఖాస్తు చేశారని తెలిపారు. అట్టి దరఖాస్తును పరిశీలించి శనివారం ఆకస్మిక తనిఖీ చేశామని, ఈ తనిఖీలో దిగుమతి చేసేందుకు లారీల్లో ఉన్న దాన్యం బస్తాలను తీయించి రైతుల సమక్షంలో తూకం వేయించారు. తూకంలో ఎలాంటి వ్యత్యాసం లేదని సక్రమంగానే ఉన్నదని ఏలాంటి అవకతవకలు జరిగినట్లు గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో ఎక్కడైనా తూకాల్లో అక్రమాలకు పాల్పడితే అట్టి మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తూనికలు కొలతలు శాఖ అధికారి, పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ మేనేజర్ రాఘవేందర్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, తూనికల కొలతల శాఖ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.