బట్టలూడదీసి.. బెల్టుతో చావబాది..

నవతెలంగాణ- థానే: మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత పట్టణమైన థాణేలో పట్టపగలే దారుణం జరిగింది. తమ వద్ద తీసుకున్న రూ. 300 తిరిగి చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగా నగ్నంగా మార్చి బెల్టుతో చావబాదారు. మంగళవారం మధ్యాహ్నం థాణే శివారు కల్వా మసీదులో జరిగిందీ ఘటన. నిందితులు తౌసిఫ్‌ ఖాన్‌బాండే, శామిల్‌ ఖాన్‌బాండే తొలుత బాలుడి ఇంటికి వెళ్లి తమ బ్లూటూత్‌ డివైజ్‌ చోరీ చేసినట్టు ఆరోపించారు. ఆపై తమ వద్ద తీసుకున్న రూ. 300 వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి ఆరోపణలను ఖండించిన బాలుడు.. డబ్బులు ఇచ్చేది లేదన్నాడు. దీంతో అతడిని సమీపంలోని మసీదు వద్దకు ఈడ్చుకెళ్లి కాళ్లతో తంతూ, పిడిగుద్దులు కురిపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఆపై అందరూ చూస్తుండగానే బాలుడి దుస్తులు విప్పి నగ్నంగా మార్చి బెల్టుతో చావబాదారు. తౌసీఫ్‌ బెల్టుతో బాదుతుంటే శామిల్‌ తీరిగ్గా వీడియో తీశాడు. చివరికి బాలుడే వారి చేతుల్లోంచి ఎలాగోలా తప్పించుకుని కల్వా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తొలుత పట్టించుకోని పోలీసులు వీడియో వైరల్‌ కావడంతోఎఫ్‌ఆర్‌ నమోదు చేశారు.

Spread the love