నాణ్యమైన విద్యనందించేందుకు కృషి

– ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌
నవతెలంగాణ-కడెం
విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఖానాపూర్‌ నియోజవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. సోమవారం నచ్చన్‌ఎల్లాపూర్‌ గ్రామంలో సైన్స్‌ ల్యాబ్‌ గదుల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలో నూతన కేజీబీవీ పాఠశాలను ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలతో నిర్మాణ పనులను చెపడుతొందన్నారు. జడ్పీఎస్‌ఎస్‌, ఎంపీపీఎస్‌, పాఠశాలలో సోషల్‌వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బీసీ, మైనారిటీ గురుకులాలో, కేజీబీవీ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వారు తెలిపారు. అమ్మఆదర్శ పాఠశాల పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించడం జరుగుతుందని అన్నారు. విద్య వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే, వివిధ రకాల చెట్లను నాటాలని, గ్రీనరీని ఏర్పాటు చేయాలని సూచించారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు, పాఠశాల సిబ్బంది పలు సూచనలు చేశారు. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడెం ఎంపీపీ ఆంటోనీ అలెగ్జాండర్‌, సెక్టోరల్‌ అధికారి సలోమి కరుణ, ఎంఈఓ మధుసూదన్‌, ఎస్‌ఓ విమల, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు తుమ్మల మల్లేష్‌ యాదవ్‌, నిర్మల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు పొద్దుటూరి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love