కౌంటింగ్‌ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల
నవతెలంగాణ-పాల్వంచ
కౌంటింగ్‌ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల తెలిపారు. శనివారం పాల్వంచ అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్న ఐదు నియోజకవర్గాల కౌంటింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లను రిటర్నింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ సాయుధ బలగాల పహారా చేపట్టినట్లు చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలలో ఉంటుందని చెప్పారు. ఐదు నియోజకవర్గాల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించుటకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్‌ రూంలతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం నిశిత పరిశీలనకు సీసీ కెమెరాలను అమర్చి మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఏర్పాటు చేసిన సీల్స్‌ పరిశీలించారు.కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలలో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, కౌంటింగ్‌ టేబుల్స్‌, ఇతర అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. మీడియా కేంద్రం, అల్పాహారం, భోజన ఏర్పాట్లును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారులు ప్రతిక్‌ జైన్‌, రాంబాబు, మంగిలాల్‌, శిరీష, కార్తీక్‌, డిఆర్డీఓ మధుసూదన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love