789 టీఎంసీలకు పోరాటం

789 టీఎంసీలకు పోరాటం– స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌(ఎస్‌వోసీ)లో తెలంగాణ డిమాండ్‌
– కృష్ణా జలాల వివాదం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కృష్ణా జలాల వివాదంలో వెనక్కి తగ్గకూడదనే వ్యూహాంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నది. రావాల్సిన జలాల్లో ఒక్క టీఎంసీని సైతం వదులుకోరాదని ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు సాగునీటి శాఖకు ఆదేశాలి చ్చింది. దీంతో సాగునీటిపారుదల ఉన్నతాధికారులు కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ-2)లో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌(ఎస్‌వోసీ) దాఖలు చేసింది. ఇప్పటికే తన వాదనలను జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు సమర్పించింది. ఈమేరకు సాగునీటి శాఖ అధికారులు పలుమార్లు చర్చించడంతోపాటు కొత్త ప్రభుత్వంతోనూ సంప్రదింపులు చేశాక ఎస్‌వోసీ కేడబ్ల్యూడీటీకి అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు నుంచి ఎస్‌వోసీ వాదనలను ఇంకా రికార్డు చేయలేదు. అక్కడ సాధారణ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌ రాకముందే వాదనలు వినిపించే అవకాశం ఉన్నా, ఆ ప్రయత్నం ఏపీ సాగునీటి శాఖ అధికారులు చేయలేకపోయారు. దీంతో ఏపీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కేడబ్ల్యూడీటీ పదే పదే ఎస్‌వోసీ దాఖలు చేయాలంటూ ఏపీ అధికారులకు చెప్పినా, పెడచెవిన పెట్టడంతో ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు పది రోజుల కింద ఢిల్లీలో జరిగిన కేడబ్యూడీటీ-2 సమావేశంలో ఎస్‌వోసీ దాఖలు చేయడానికి కొంత సమయం ఇచ్చారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 1050 టీఎంసీలకుగాను 789 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలనే డిమాండ్‌ను ట్రిబ్యునల్‌ ముందు ఉంచినట్టు సమాచారం. నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటి) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు నివేదించింది. మిగులు జలాల్లో 291 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. అలాగే వీటిని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు వాడుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ సాగునీటి శాఖ కేడబ్లూడీటీ-2 ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. ఏపీ వాదనలను ట్రిబ్యునల్‌ విన్నాక, తుది నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ముగిసాక మళ్లీ వాదనలు ఢిల్లీలో జరగనున్నాయి. ఆ తర్వాత కృష్ణా జలాల వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Spread the love