నేడు ఢిల్లీలో కిసాన్ మహాపంచాయత్ : ఎస్కేఎం సాధన కోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న కిసాన్ మహాపంచాయత్‌కు హాజరయ్యేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. మూడేండ్ల తరువాత ఢిల్లీ లోపల తమ గొంతును ప్రతిధ్వనిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ ఆదాయం తగ్గడం, కార్పొరేట్ లాభం కోసం అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములు, అటవీ భూములు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులు, ఆదివాసీ రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ, వలస కార్మికులు, గ్రామీణ కార్మికులు, నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తి అంశాలపై కిసాన్ మహా పంచాయత్‌లో లేవనెత్తుతామని తెలిపారు. 2021 డిసెంబర్ 9న ఎస్‌కెఎంకి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నేరవేర్చాలని ఎస్కేఎం నేతలు పునరుద్ఘాటించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నానాటికీ పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, రైతులు తమ పంటలకు లాభదాయకమైన ధరల పొందకపోవడం కారణంగా, దేశంలో 80 శాతం కంటే ఎక్కువ మంది రైతులు భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు బలవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై ఎస్కేఎం అనేకసార్లు అనుమానాలను ఎత్తిచూపిందనీ, ఎంఎస్పీ, దాని పేర్కొన్న ఎజెండా రైతుల డిమాండ్లకు విరుద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎంతో చర్చించిన తరువాతనే విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఎస్కేఎంకి రాతపూర్వక హామీ ఇచ్చిందనీ, అయితే ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్, గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల డిమాండ్‌ను ఎస్కేఎం పునరుద్ఘాటిస్తుందని స్పష్టం చేశారు. కరువు, వరదలు, వడగండ్ల వాన, అకాల వర్షాలు, పంట సంబంధిత చీడలు, అటవీ జంతువులు, విచ్చలవిడి పశువులు కారణంగా రైతులు నిరంతరం ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి, అన్ని పంటలకు సార్వత్రిక, సమగ్ర, సమర్థవంతమైన పంట బీమా, పరిహారం ప్యాకేజీని అమలు చేయడానికి పీఎంఎఫ్‌బీవైని పునరుద్ధరించాలని కోరారు.
డిమాండ్లు
1. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా సీ2ం50 శాతం ఫార్ములాను ఉపయోగించి అన్ని పంటలకు ఎంఎస్పీ హామీ ఇచ్చే చట్టం రూపొందించి అమలు చేయాలి. హామీ ఇచ్చిన పంట సేకరణ వెంటనే చేయాలి.
2. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా ఎస్కేఎం ప్రతినిధులను ఆ కమిటీలో చేర్చడంతో పాటు రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ఎంఎస్పీపై మాత్రమే కొత్త కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి.
3. రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువులతో సహా ఇన్‌పుట్ ధరలను తగ్గించాలి.
4. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలి.
5. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికోనియాలో నలుగురు రైతులు, జర్నలిస్టు హత్యకేసులో ప్రధాన సూత్రధారి, కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించి, అరెస్టు చేసి జైలుకు పంపాలి.
6. రైతు ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలతో పాటు లఖింపూర్ ఖేరీలో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
7. పంట బీమా, పరిహారం ప్యాకేజీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన పీఎంఎఫ్‌బీవైని పునరుద్ధరించాలి. నష్టాన్ని వ్యక్తిగత ప్లాట్ల ఆధారంగా అంచనా వేయాలి.
8. రైతులు, వ్యవసాయ కూలీలందరికీ నెలకు రూ.5,000 రైతు పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి.
9. రైతు ఉద్యమం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రైతులపై నమోదు చేసిన నకిలీ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
10. సింఘూ సరిహద్దు వద్ద అమరులైన రైతుల స్మారక చిహ్నం నిర్మాణానికి భూ కేటాయింపులు చేయాలి.