ఆర్జీయూకేటీలో విద్యార్థిని బలవన్మరణం

RGUKTనవతెలంగాణ – హైదరాబాద్
బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ-1 విద్యార్థిని(16) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకొంది. ఆమెది సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం. మృతురాలి తండ్రి ఫోన్‌లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘బంధువుల వివాహం ఉండటంతో వారం క్రితం నేను బాసరకు వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లా. గురువారం ఉదయం ఇద్దరం తిరిగి ఆర్జీయూకేటీకి చేరుకున్నాం. రాత్రి 8.30 గంటలకు నాకు ఫోన్‌ చేసి ఇంటికి చేరుకున్నావాని అడిగింది’’ అని చెబుతూ ఆయన కంట తడి పెట్టారు. ఆర్జీయూకేటీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి స్టడీ అవర్స్‌కి వెళ్లకుండా ఆమె తన గదిలోనే ఉంది. అదే గదిలో ఉరి వేసుకొంది. గమనించిన తోటి విద్యార్థులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. గదిలో ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ప్రేమించిన వ్యక్తి నెల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆ లేఖలో ఉందని పోలీసులు తెలిపారు.

Spread the love