– ఇంగ్లీష్ టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
తమను నిత్యం వేధిస్తున్న ఇంగ్లీష్ టీచర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా మునిసిపాలిటీ పరిధిలోని నాగనూల్ కస్తూర్బా గాంధీ గురుకులం విద్యార్థినులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పది రోజుల కిందట ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇప్పటి వరకు సదరు టీచర్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కొద్దిగా ఆలస్యమైనా టీచర్ వేధిస్తున్నారని, చదవడం లేదని గొంతు పట్టుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను సస్పెండ్ చేసే వరకు తరగతి గదికి వెళ్లబోమని మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా విద్యార్థులు ఎండలోనే సుమారు మూడు గంటల పాటు బైటాయించారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థి, రాజకీయ పార్టీల నాయకులు అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని వెంటనే సస్పెండ్ చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకులు కందికొండ గీత డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేసే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆలస్యంగా వస్తే మూడు గంటలపాటు తాగునీరు ఇవ్వకుండా, కనీసం టాయిలెట్స్‌కు పోనివ్వకుండా హింసించడం సరికాదన్నారు. వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని బ్లేడ్‌తో చెయ్యి కోసుకోవడం బాధాకరమన్నారు. ఈ విషయంపై ఫోన్ ద్వారా డీఈ వోని సంప్రదిం చగా.. తాను షోకాజ్ నోటీసులు పంపించాను.. సస్పెండ్ చేసే అధికారం తన వద్ద లేదని, కలెక్టర్ పరిధిలో ఉందని తెలిపారు.