– ప్రధాన రోడ్డుపై ఆందోళన
నవతెలంగాణ- న్యాల్‌కల్
పీజీ కోర్సు తొలగించొద్దని విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మిర్జాపూర్(బి)లో సోమవారం జరిగింది. ప్రభుత్వం మిర్జాపూర్(బి) ఓయూ పీజీ కళాశాలను ఎత్తేయడానికి కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థులు ఎన్ కిరణ్, శివకుమార్, నరసింహులు, నిఖిల్ మాట్లాడుతూ.. పీజీ చదువుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ఈ కళాశాలలో అనలెటికల్ కెమిస్ట్రీ కోర్సును తొలగిస్తూ ఓయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఐదుగురు విద్యార్థుల అడ్మిషన్లను తొలగించారని చెప్పారు. పీజీ కళాశాలను పూర్తిగా ఎత్తేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పీజీ కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న హద్నూర్ ఎస్‌ఐ రామానాయుడు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. విద్యార్థుల సమస్యలను కాలేజీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.