నవతెలంగాణ-హైదరాబాద్ : ఉద్యోగ పరీక్షల షెడ్యూల్‌పై విద్యార్థులు మండిపడ్డారు. ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ (పీసీఎస్) ప్రిలిమ్స్ ఎగ్జామ్ డిసెంబరు 7, 8 తేదీల్లో ఉదయం 9.30 నుంచి 11.30, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అలాగే రివ్యూ, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీ పరీక్షను డిసెంబరు 22, 23 తేదీల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థుల ప్రయోజనంతోపాటు, అవకతవకలకు అవకాశం లేని కేంద్రాల్లో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ వెల్లడించింది.
కాగా, ఈ ఉద్యోగ పరీక్షలను రెండు రోజుల్లో, రెండు షిఫ్టుల్లో నిర్వహించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పరీక్షలను ఒక రోజు, ఒక షిఫ్ట్‌లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లోని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద విద్యార్థులు భారీగా నిరసన చేపట్టారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. బారికేడ్లను తొలగించి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు కమిషన్ కార్యాలయం వద్ద విధ్వంసానికి పాల్పడిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఇప్పుడు విద్యార్థుల ఇళ్లను బుల్డోజర్‌తో సీఎం యోగి కూల్చివేస్తారా? అని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. అయితే విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చింది. సామరస్యపూర్వక పరిష్కారాన్ని యోచించాలని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సమావేశమయ్యారు. విద్యార్థుల ఆందోళనపై చర్చిస్తున్నారు. పరిష్కార మార్గాలపై సమాలోచనలు చేస్తున్నారు.