విద్యార్ధులు సమాజాన్ని అధ్యయనం చేయాలి: ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులు తమ చదువులతో పాటు సమాజంలో అసమానతలు ,ఆర్ధిక అంతరాలు రూపుమాపేందుకు సమాజాన్ని మార్చేందుకు అధ్యయనం చేయాలని ఆంద్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక శిక్షణా తరగతుల ప్రారంభ సభ జరిగింది. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లడుతూ సమాజంలో ఆధిపత్య వర్గాల భావాజాలం అధికార భావాజాలంగా ఉందని,బలహీన వర్గాలు, పేదలు వారికి అందాల్సిన సౌకర్యాలు దేశంలో అందడం లేదని ఆయన అన్నారు. ఒక వర్గం పై పని గట్టుకుని మరి విషప్రచారం దేశంలో చేస్తున్నారనిఅన్నారు. ప్రశ్నించడం అనేది కీలకమని ప్రశ్నతోనే సమాజం ముందుకు వెళ్తుందని అన్నారు. భారతదేశంలో పాలిస్తున్న పాలకులు తమ భావాజాలం వ్యాప్తి చేసేందుకు, విద్య, చరిత్ర, అన్ని అంశాలను వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. అందుకే సమసమాజం రావడానికి విద్యార్థులు తమ అకడమిక్ చదువులుతో పాటు సమాజంలో జరిగే దోపిడీ, అసమానతలు, ఆధిపత్య ధోరణలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడుతూ దేశంలో సమసమాజ స్థాపనకు పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ,రానున్న కాలంలో బలమైన పోరాటాలు  నిర్వహణకు ఈ తరగతులలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర తరగతులలో రాష్ట్ర ఉపాధ్యాక్షులు రజనీకాంత్,శ్రీకాంత్ వర్మ, ప్రశాంత్, శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మమత, డి.కిరణ్, అశోక్ రెడ్డి, డి.ప్రశాంత్,రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love