సుదర్శన్‌ సునామీ

– 47 బంతుల్లోనే 96 బాదిన సాయి సుదర్శన్‌
– వృద్దిమాన్‌ సాహా అర్థ సెంచరీ
– గుజరాత్‌ టైటాన్స్‌ 214/4
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
శుభ్‌మన్‌ గిల్‌, డెవిడ్‌ మిల్లర్‌, హార్దిక్‌ పాండ్య ధనాధన్‌కు సిద్ధమైన చెన్నై సూపర్‌కింగ్స్‌కు.. తమిళనాడు యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (96, 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌తో షాక్‌ ఇచ్చాడు!. క్వాలిఫయర్‌2లో వేగంగా ఆడలేక రిటైర్డ్‌ అవుట్‌గా నిష్క్రమించిన సాయి సుదర్శన్‌.. టైటిల్‌ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సాయి సుదర్శన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఐపీఎల్‌16 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా (54, 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో మతిశ పతిరణ (2/44) రెండు వికెట్ల ప్రదర్శన చేశాడు.
సుదర్శన్‌ మెరుపుల్‌ :
టాస్‌ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్‌ అహ్మదాబాద్‌ పిచ్‌పై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. క్వాలిఫయర్‌2లో ముంబయి ఇండియన్స్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌.. తుది పోరులోనూ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమై వచ్చింది. గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లను ఆరంభంలోనే అవుట్‌ చేసే అవకాశాలను సూపర్‌కింగ్స్‌ చేజార్చుకుంది. 2 పరుగుల వద్ద గిల్‌ క్యాచ్‌ను దీపక్‌ చాహర్‌ వదిలేయగా.. సాహాను రనౌట్‌ చేసే అవకాశాన్ని జడేజా జారవిడిచాడు. జీవనదానంతో గిల్‌ తర్వాత వరుస ఓవర్లలో దంచికొట్టగా.. సాహా సైతం అదే పని చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ల మెరుపులతో ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. తర్వాతి వచ్చిన బ్యాటర్లు అదే జోరు కొనసాగించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్‌ కథ ముగియగా.. అర్థ సెంచరీ తర్వాత సాహా నిష్క్రమించాడు. గిల్‌తో 67 పరుగులు, సుదర్శన్‌తో కలిసి 64 పరుగులు జోడించిన సాహా.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సాహా ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. సుదర్శన్‌ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 33 బంతుల్లోనే ఆ ఘనత అందుకున్నాడు. సాహా అవుటైనా.. మరో ఎండ్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (21 నాటౌట్‌) అండతో సాయి సుదర్శన్‌ రెచ్చిపోయాడు. ఆరు సిక్స్‌లు, ఎనిమిది బౌండరీలు బాదిన సాయి సుదర్శన్‌.. డెత్‌ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. సూపర్‌కింగ్స్‌ స్టార్‌ పేసర్‌ మతిశ పతిరణపై 14 బంతుల్లోనే 34 పరుగులు పిండుకున్న సాయి సుదర్శన్‌ టైటాన్స్‌కు భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో వరుస సిక్సర్లతో శతకం ముంగిట నిలిచిన సుదర్శన్‌.. ఎల్బీగా నిష్క్రమించాడు. సాయి సుదర్శన్‌, సాహా, పాండ్య మెరుపులతో గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు :
గుజరాత్‌ టైటాన్స్‌ : వృద్దిమాన్‌ సాహా (సి) ధోని (బి) చాహర్‌ 54, శుభ్‌మన్‌ గిల్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 39, సాయి సుదర్శన్‌ (ఎల్బీ) పతిరణ 96, హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 21, రషీద్‌ ఖాన్‌ (సి) గైక్వాడ్‌ (బి) పతిరణ 0, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214.
వికెట్ల పతనం : 1-67, 2-131, 3-212, 4-214.
బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 4-0-38-1, తుషార్‌ దేశ్‌పాండే 4-0-56-0, మహీశ్‌ తీక్షణ 4-0-36-0, రవీంద్ర జడేజా 4-0-38-1, మతీశ పతిరణ 4-0-44-2.

Spread the love