– అధిక వర్షాలతో గణనీయంగా పడిపోయిన దిగుబడి
– 12 క్వింటాళ్లు రావాల్సింది మూడు, నాలుగుకే పరిమితం
– అరకొర పంట పల్లెల్లోనే విక్రయం
– సీసీఐ కొనుగోలు కేంద్రాలు వెలవెల
– జిన్నింగ్ మిల్లుల్లో అమ్మేకొద్ది సరుకూ వ్యాపారులదే..!
నవతెలంగాణ – ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధులు
అధిక వర్షాలతో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగా రావాల్సింది మూడు, నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో సాగయ్యే పత్తి పంటకు ఈ ఏడాది అననుకూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. 25 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 280కి పైగా భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేసింది. ఇప్పటికే చాలా చోట్ల కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే, తేమ పేరిట ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ పేచీలు పెట్టడం.. 12శాతం దాటితే కొనుగోలు చేసేందుకు నిరాకరించడం.. ఇటు ప్రయివేటు వ్యాపారులు మద్ధతు ధర కంటే తక్కువగా నిర్ణయించడం వంటి కారణాలతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. పండిన కొద్ది పాటి పంటను జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాలకు తరలించి విక్రయించే కంటే స్థానికంగా అమ్ముకుంటే రవాణా ఖర్చులైనా మిగులుతాయనే ఉద్దేశంతో రైతులు కొంత ధర తక్కువైనా లోకల్‌గానే విక్రయిస్తున్నారు. ఆధార్ నెంబరే ప్రామాణికంగా సీసీఐ కొనుగోళ్లు చేస్తుంది. కాబట్టి రైతులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుకు సంబంధించిన ఐరిస్ లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా సీసీఐ కొనుగోళ్లు చేస్తున్నా గతేడాది అనేక అవక తవకలు వెలుగు చూశాయి. పత్తి కొనుగోళ్లకు కొన్నిచోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం, నెలకొల్పిన చోట రకరకాల దగా చర్యల వల్ల రైతులు, రైతుసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
వర్షాలతో దెబ్బతిన్న పంట..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు ఇప్పటి వరకూ ఊపందుకోలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు పంట దెబ్బతింది. పత్తి తీతలకు వర్షం ప్రధాన అవరోధంగా మారింది. వర్షాలకు ముందు తీసిన పత్తిని పెట్టుబడుల నిమిత్తం రైతులు ముందుగానే ప్రయివేటు వ్యాపారు లకు అమ్ముకున్నారు. వర్షాభావం ఉన్న జిల్లాల్లో రైతులు పత్తి తీతలు ప్రారంభించారు.
ధర లేక దిగాలు..
ఓ వైపు దిగుబడులు నిరాశాజనకంగా ఉంటే.. మరోవైపు పత్తి ధర ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ పరిధిలో తిరుమలాయ పాలెం, ఖమ్మం రూరల్‌తో పాటు పొరుగున మహబూబాబాద్ జిల్లా మరిపెడ, డోర్నకల్, కొరవి, సూర్యాపేట జిల్లా మోతే.. ఇటు ఖమ్మం, ఏన్కూరు, వైరా వ్యవసాయ మార్కెట్ పరిధిలోని తల్లాడ, సుజాతనగర్, జూలూరుపాడులో ప్రయివేటు వ్యాపారులు పత్తిని కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మార్కెట్ పరిధిలోనూ విక్రయాలు సాగుతున్నాయి. పినపాక, భద్రాచలం, కొత్తగూడెం నియోజక వర్గాల సరుకును ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి కనీస మద్దుతు ధర క్వింటాకు రూ.7,521 చొప్పున ప్రకటించింది. కానీ నాణ్యత లేదనే సాకుతో రైతుల వద్ద క్వింటాకు రూ.5వేల నుంచి రూ.6వేలు మాత్రమే ధర పెడుతున్నారు. ఇదే పత్తిని వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందుతూ లాభాలు గడిస్తున్నారు.
అధిక తేమ శాతంతో సీసీఐకి పత్తి శూన్యం
దిగుబడులు లేకపోవడం, అరకొర పంటను కూడా స్థానికంగా అమ్ముకోవడం, అన్నింటికీ మించి తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సీసీఐ కేంద్రాలకు పత్తి రావడం లేదు. ఖమ్మం జిల్లాలో 9, భద్రాద్రి కొత్తగూడెంలో నాలుగు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమ్మం రూరల్ మండలం కొనుగోలు కేంద్రంలో 9 మంది రైతులకు చెందిన కేవలం 269 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొన్నారు. మిగిలిన కేంద్రాల్లో ఎక్కడా ఒక్క క్వింటా కూడా అమ్మిన దాఖలాలు లేవు. వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. సీసీఐ 8-12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తుంది. 8శాతం తేమ ఉంటే రూ.7,501, 9 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ.75 తక్కువగా, 10శాతం ఉంటే రూ.150, 11శాతం ఉంటే రూ.225, 12 శాతం ఉంటే రూ.300 తక్కువగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అయితే 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే మాత్రం ఆ పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. కానీ అధిక మొత్తం పత్తిలో 20-30 శాతం తేమ ఉండటంతో సీసీఐకి విక్రయించకుండా ప్రయివేటుగా అమ్ముకుంటున్నారు. పత్తి రైతు ఖాతాల సమాచార నిమిత్తం సీసీఐ ‘కాటర్ అల్లై’ యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తేమశాతం ఎక్కువగా ఉన్న నేపథ్యం లో సరైన రేటు రాదని భావించి స్థానికంగానే అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున ఓా్నరు. అత్యవసరం లేని రైతులు కొందరు ఆరబెట్టి ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నారు. నవంబర్ 15 తర్వాత సీసీఐ కొనుగోళ్లు ఊపందుకోవచ్చని మార్కెటింగ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్షానికి పత్తి నేలకారింది
వనవాసం రామయ్య, రైతు, గుండెపూడి
ఎడతెరపి లేని వర్షాలకు పత్తి నేలకారింది. ఎకరానికి రూ.20వేల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే మూడు, నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని భయంగా ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్‌కు తొలి పత్తిని తీసుకొచ్చిన రైతులకు కనీసం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా లభించడం లేదు. 8 నుంచి 12శాతం లోపు తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధనలు విధించింది. కానీ తొలి పత్తి కావడం.. ఇటీవల వర్షాలు కురవడం.. సహజంగానే వాతావరణంలో తేమ ఉండటంతో ఈ ప్రభావం మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తిలో కనిపిస్తోంది. మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభమైన శనివారం మొత్తం 11వేల 101 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇందులో సీసీఐ 838 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా 10262క్వింటాళ్లను ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. మరోవైపు ప్రయివేటు వ్యాపారులు క్వింటాల్‌కు కేవలం రూ.7150 మాత్రమే నిర్ణయించారు. అయినా.. తేమ పేరిట ధరలో భారీగా కోత విధిస్తుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తొలిరోజున రైతుల ఆందోళన కారణంగా తేమతో సంబంధం లేకుండా (గుడుగోన) పద్దతిలో క్వింటాల్‌కు రూ.6840చొప్పున కొనుగోలు చేశారు.
– ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన రైతు దుమాల అశోక్ 10.61క్వింటాళ్ల పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చారు. ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాల్‌కు రూ.7521 ఉండగా తేమతో సంబంధం లేకుండా వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.6840చొప్పున విక్రయించారు. రైతు అమ్మిన మొత్తం పత్తికి రూ.72,572 ధర వచ్చింది. కానీ వాస్తవంగా ప్రభుత్వ మద్దతు ధరతో విక్రయిస్తే రూ.78,960 రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన సదరు రైతు రూ.6300వరకు నష్టపోవాల్సి వచ్చింది. వీటికి అదనంగా వాహనం అద్దె మరో రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ధర రాకపోవడంతో చాలా నష్టం
పసుల లచ్చన్న, రైతు, జందాపూర్
మార్కెట్‌లో రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర కూడా లభించకపోవడం బాధాకరం. 18క్వింటాళ్ల పత్తిని విక్రయించాను. మద్దతు ధర లభించకపోవడంతో సుమారు రూ.11వేల వరకు నష్టపోవాల్సి వచ్చింది. తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.