వేడిగాల్పులతో ఉక్కిరిబిక్కిరి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గురువారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు దాటాయి. వచ్చే వారం రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. ఒకటెండ్రు మినహా అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. మరోవైపు వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడెనిమిది గంటల వరకు వేడిగాల్పులు వీస్తున్నాయి. దీనికితోడు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకున్నా వేడిగాల్పులే వస్తున్న పరిస్థితి. 26 నుంచి 29 తేదీ వరకు రాష్ట్రంలో నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, కొమ్రంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో పలు జిల్లాల్లో ఒకటెండ్రు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని సూచించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) నివేదిక ప్రకారం గురువారం ఉదయం 8:30 నుంచి రాత్రి 10:00 గంటల వరకు రాజన్నసిరిసిల్లలోని గంభీరావుపేట, వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో తేలికపాటి వర్షం కురిసింది.

Spread the love