చెరుకు తీపి

గ్రామాల్లోని రైతులు పండించే చెరుకు చాలా రుచిగా ఉంటుందని అడవిలో వున్న ఓ గున్న ఏనుగు మిత్రుల ద్వారా తెలుసుకుంది. అదే విషయం అమ్మకు చెప్పింది.
”అది నిజం కాదు. పొలాల్లో పండించే వాటికన్నా సహజంగా అడవిలో దొరికేవే రుచిగలవి. అయినా రైతులు కష్టపడి పండించుకునే వాటిపైన నీకెందుకు మనసు మళ్ళింది? ఆశపడి పొరపాటుగా కూడా గ్రామాల్లోకి వెళ్లొద్దు. మనుషుల కంట పడొద్దు. నీ ప్రాణాలకే ప్రమాదం” అని అమ్మ ఏనుగు హెచ్చరించింది.
అయినా గున్న ఏనుగు మనసు పొలాల్లో పండించే చెరుకు మీదే ఉండిపోయింది. ఒకరోజు రాత్రి అమ్మ ఏనుగు నిద్ర పోతుండగా చెప్పాపెట్టకుండా అడవినుంచి ఓ గ్రామం వైపు బయలుదేరింది. మైళ్ళ కొద్దీ కష్టపడి నడిచాక చెరుకు తోట కనిపించింది. ఆనందంతో తోటవైపుకు పరుగులు తీస్తూ ఉంటే కాలు జారి వ్యవసాయ బావిలో ‘ధబీ’మని పడింది.
అందులో మునిగిపోయేంత నీళ్ళు లేవు కానీ, బావి నుంచి బయటపడటానికి మాత్రం నానా తిప్పలు పడసాగింది. బావినీళ్ళలోనే నాలుగైదుసార్లు గుండ్రంగా తిరిగింది. ‘ఏమైపోతానో’ అని భయపడ్డ ఏనుగు ఘీంకరించడం ప్రారంభించింది.
ఏనుగు అరుపులు విని అక్కడే ఉన్న కప్పలు ”ఏనుగు బావా, అంత గట్టిగా అరవొద్దు. మనుషులు విన్నారంటే నిన్ను చితకబాదుతారు. మా మిత్రులను తీసుకొచ్చి నిన్ను ఎలాగోలా గట్టున పడేస్తాం” అని భరోసా ఇచ్చాయి. బిత్తర చూపులు చూస్తూ గున్న ఏనుగు అరవడం ఆపేసింది. కప్పలన్నీ దుముక్కుంటూ వెళ్లి దగ్గరలో ఉన్న తొండ, తాబేళ్ళు, నక్కలను తీసుకొచ్చాయి.
అవన్నీ బావి చుట్టూ తిరిగి ‘ఏనుగును ఎలా బయటపడేయాలా’ అని ఆలోచించాయి. ఒకచోట బావికి ఉన్న రాతి కట్టడం దెబ్బ తిని రాళ్ళన్నీ వదులుగా వుండటం గమనించాయి.
కొన్ని జంతువులు రాతి కట్టడంలోని కొన్ని రాళ్ళను తీసి బావిలో పడేశాయి. వాటి మీద ఏనుగు నిలబడేట్లు చేశాయి.
మరి కొన్ని జంతువులు ఒడ్డును కొంచెం తవ్వి ఏటవాలుగా దారి చేశాయి. ఏనుగు సులభంగా ఎక్కి రావడానికి కొంచెం మట్టి కూడా తెచ్చి పోశాయి.
దారి కనిపించగానే గున్న ఏనుగుకు ప్రాణం లేచి వచ్చింది. తొండం, ముందరి కాళ్ళ సాయంతో ఒడ్డు పైకి పాకడం ప్రారంభించింది. పట్టు కుదరక ఒకటికి రెండుసార్లు కాలు జారి నీళ్ళలో పడింది. ఏడుపు ముఖం పెట్టి బాధగా జంతువుల వైపు చూసింది. ఒడ్డు మీద ఉన్న జంతువులన్నీ గట్టిగా ధైర్యం చెప్పడంతో మరోసారి ప్రయత్నించి ఎలాగోలా బావినుంచి బయటపడింది.
ఇంతలో అమ్మ ఏనుగు అడవి నుంచి పరుగులు తీస్తూ వచ్చి అక్కడికి చేరుకుంది. చెప్పకుండా వచ్చినందుకు గున్న ఏనుగును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. తన బిడ్డను ఆపద నుంచి రక్షించినందుకు జంతువులకు ధన్యవాదాలు తెలిపింది.
పక్కనే వున్న జంతువులు గబగబా చెరుకు గెడలు కొన్ని కోసుకొచ్చి ”కావాలంటే తిని చూడు, చెరుకు తీపి ఎక్కడైనా ఒక్కటే” అని గున్న ఏనుగుకు చెప్పాయి.
రెండు చెరుకు గడలు తిని ”నిజమే! రెండింటి రుచులూ ఒకటే. పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయను” అని గున్న ఏనుగు ప్రమాణం చేసింది.
జరుగుతున్న అలజడి గమనించిన గ్రామస్తులు కత్తులు, కర్రలు ఎత్తుకుని రావడం కనిపించింది.
వెంటనే ఏనుగులు అడవిలోకి పరుగులు తీయడం ప్రారంభించాయి. జంతువులన్నీ తలా ఒక దిక్కుకు పారిపోయాయి. చెట్ల మీది కోకిలమ్మలు ”కుహూ… కుహూ” రాగాలు పలికాయి.
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు, 9393662821

Spread the love