ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్నాయి..

నవతెలంగాణ-హైదరాబాద్ : గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తన పరిస్థితి ఏమీ బాలేదని, తాను కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నానని చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్నాయని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తాగుతున్నానని షణ్ముఖ్ వివరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంపత్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ కనిపించాడు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు షణ్ముఖ్ ను విచారించగా.. తన మానసిక పరిస్థితి బాలేదంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడని తెలిపారు. కాగా, షణ్ముఖ్ శనివారమే బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Spread the love