ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి..

నవతెలంగాణ- ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. ఈ వారం ప్రారంభంలో హత్యకు గురైన ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బదక్షన్ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ బాంబుదాడిలో 11 మంది మరణించగా.. 30 మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి, తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, తాలిబాన్లకు సవాల్ విసురుతున్నారు. పలు ప్రాంతాల్లో మసీదుల్లో దాడులకు తెగబడి వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీశారు. ముఖ్యంగా మైనారిటీలపై ఎక్కువగా దాడులకు తెగబడుతున్నారు. మంగళవారం రోజున ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన కారును, బదక్షన్ ప్రావిన్స్ గవర్నర్ గా ఉన్న నిసార అహ్మద్ అహ్మదీ ప్రయాణిస్తున్న కారువైపు తీసుకెళ్లి పేల్చేశాడు. ఈ ప్రమాదంలో అహ్మదీ మరణించారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాధ్యలుగా ప్రకటించుకున్నారు. ఈ దాడిలో అహ్మదీ డ్రైవర్ కూడా మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ రోజు అహ్మదీ అంత్యక్రియల్లో ఫైజాబాద్‌లోని నబావి మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని దాడికి తెగబడ్డాడు.

Spread the love