ఖర్గేకు సమన్లు

– భజరంగ్‌దళ్‌ కేసులో జారీచేసిన పంజాబ్‌ కోర్టు
పంజాబ్‌ : రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షడు మల్లిఖార్జున ఖర్గేకు పంజాబ్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 10న కోర్టు ముందు హాజరుకావాలని సంగ్రూర్‌ జిల్లా కోర్టు ఖర్గేను ఆదేశించింది. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ విశ్వహిందూ పరిషత్‌ యువజన విభాగమైన భజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భజరంగ్‌ దళ్‌ అని పేరు పెట్టి, కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిషేధిత ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)తో భజరంగ్‌దళ్‌ను పోల్చినందుకు ‘భజరంగ్‌ దళ్‌ హిందుస్థాన్‌’ సంస్థ అధ్యక్షుడు హితేష్‌ భరద్వాజ్‌… మల్లిఖార్జున ఖర్గేపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ఖర్గేకు పంజాబ్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో బజరంగ్‌ దళ్‌ను సిమి, అల్‌-ఖైదా వంటి దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని పిటిషనర్‌ హితేష్‌ తెలిపారు. దీనిపై సీనియర్‌ డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. జులై 10న కోర్టుకు హాజరు కావాలని సివిల్‌ జడ్జి రమణదీప్‌ కౌర్‌ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది.

Spread the love