మోడల్ ఆత్మహత్య… తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

నవతెలంగాణ-హైదరాబాద్ : మోడల్ తాన్యా సింగ్ సూరత్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. 28 ఏళ్ల తాన్యా సింగ్ తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండ్రోజుల అనంతరం ఈ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఊహించని రీతిలో ఈ కేసులో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏసీపీ వీఆర్ మల్హోత్రా దర్యాప్తు గురించి మాట్లాడుతూ… మోడల్ తాన్యా సింగ్, క్రికెటర్ అభిషేక్ శర్మ మధ్య స్నేహం ఉందని ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. తాన్యా సింగ్ ఫోన్ నుంచి అభిషేక్ శర్మ ఫోన్ కు ఓ వాట్సాప్ సందేశం వెళ్లినట్టు పోలీసులు గుర్తించారని, కానీ ఆ మెసేజ్ కు అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదని వివరించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటికి వస్తాయని ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అభిషేక్ శర్మను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి నోటీసులు పంపాలని సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం… సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ కొన్నాళ్లుగా మోడల్ తాన్యా సింగ్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని, సోషల్ మీడియాలోనూ ఆమె మెసేజ్ లకు అతడు స్పందించడంలేదని తెలుస్తోంది.

Spread the love