సూపర్‌ స్వైటెక్‌

మట్టికోర్టులో పొలాండ్‌ భామ దూసుకెళ్తుంది. వరుసగా మూడో విజయం నమోదు చేసిన ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వైటెక్‌కు మూడో రౌండ్లో అసలు పోటీ ఎదురుకాలేదు!. యువ సంచలనం కొకొ గాఫ్‌, కాస్పర్‌ రూడ్‌ సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నారు.
– ప్రీ క్వార్టర్స్‌లో పోలాండ్‌ భామ
– రూడ్‌, కొకొ గాఫ్‌ ముందంజ
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పారిస్‌ (ఫ్రాన్స్‌)

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వైటెక్‌కు ఎదురులేదు. రొలాండ్‌ గారోస్‌లో వరుసగా మూడో విజయం సాధించిన ఇగా స్వూటెక్‌ (పొలాండ్‌) మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. శనివారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్‌ జిన్యుపై 6-0, 6-0తో స్వైటెక్‌ చెమట పట్టకుండా గెలుపొందింది. అమెరికా యువ క్రీడాకారిణి కొకొ గాఫ్‌ సైతం ముందంజ వేసింది. మూడో రౌండ్లో మిరా అడ్రీవాపై 6-7(5-7), 6-1, 6-1తో మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో కాస్పర్‌ రూడ్‌ ముందంజ వేశాడు. నాల్గో సీడ్‌ నార్వే ఆటగాడు 4-6, 6-1, 6-4తో నాలుగు సెట్ల మ్యాచ్‌లో చైనా ఆటగాడు జాంగ్‌ జిజెన్‌పై గెలుపొందాడు.
ఎదురులేని స్వైటెక్‌ :
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వైటెక్‌కు పోటీ లేదు. వరుసగా మూడో రౌండ్లో పొలాండ్‌ స్టార్‌ అలవోక విజయం నమోదు చేసింది. మూడో రౌండ్లో చైనా క్రీడాకారిణి వాంగ్‌ రెండు సెట్లలో ఒక్క గేమ్‌ పాయింట్‌ను సాధించలేకపోయింది. 6-0, 6-0తో 51 నిమిషాల్లోనే ఇగా స్వైటెక్‌ లాంఛనం ముగించింది. స్వైటెక్‌ 12 గేములు, 50 పాయింట్లు నెగ్గగా.. వాంగ్‌ 17 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఒక్క గేమ్‌ను నెగ్గలేదు. సొంత సర్వ్‌ను నిలుపుకోలేక, స్వైటెక్‌ సర్వ్‌ బ్రేక్‌ చేయలేక వాంగ్‌ తంటాలు పడింది. ఏకపక్షంగా సాగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో ఇగా స్వైటెక్‌ అలవోక విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో అమెరికా అమ్మాయి కొకొ గాఫ్‌ మెరిసింది. మిరా అడ్రీవాతో మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన గాఫ్‌.. తర్వాత రెండు సెట్లలో గొప్పగా పుంజుకుంది. 123 నిమిషాల మూడో రౌండ్‌ మ్యాచ్‌లో గాఫ్‌ 100-73 పాయింట్లతో పైచేయి సాధించింది. గాఫ్‌ 18 గేములు గెలుపొందగా.. మిరా 9 గేములు నెగ్గింది. ఎనిమిది బ్రేక్‌ పాయింట్లు సాధించిన గాఫ్‌ ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. ప్రత్యర్థి సర్వ్‌ను మూడుసార్లే బ్రేక్‌ చేసిన మిరా మూడో రౌండ్‌ నుంచి నిష్క్రమించింది. కజకిస్థాన్‌ క్రీడాకారిణి ఎలినా రిబకెనా ఫిట్‌నెస్‌ సమస్యలతో వాకోవర్‌ ఇవ్వగా.. స్పెయిన్‌ అమ్మాయి సారా సోరిబస్‌ టార్మో నేరుగా ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
రూడ్‌ జోరు :
పురుషుల సింగిల్స్‌లో నాల్గో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) జోరు కొనసాగుతుంది. చైనా ఆటగాడిని మూడో రౌండ్లో మట్టికరిపించిన కాస్పర్‌ రూడ్‌ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగు సెట్ల పోరులో రెండున్నర గంటల పాటు పోరాడిన కాస్పర్‌ రూడ్‌.. చైనా ఆటగాడిపై విజయం సాధించాడు. కాస్పర్‌ ఆరు ఏస్‌లు కొట్టగా.. జాంగ్‌ సైతం ఆరు ఏస్‌లు సంధించాడు. కాస్పర్‌ ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించగా.. జాంగ్‌ మూడు బ్రేక్‌ పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. పాయింట్ల పరంగా 116-100తో కాస్పర్‌ రూడ్‌ పైచేయి సాధించాడు. గేముల పరంగా రూడ్‌ 22 నెగ్గగా.. జాంగ్‌ 15 గేములు సాధించాడు. చిలీ ఆటగాడు నికోలస్‌ జారీ 6-2, 6-3, 6-7(7-9), 6-3తో మార్కస్‌ గైరోన్‌ (అమెరికా)పై ఉత్కంఠ మ్యాచ్‌లో గెలుపొందాడు. నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చిలీ ఆటగాడు తొలి రెండు సెట్లను సులువుగా నెగ్గాడు. టైబ్రేకర్‌కు దారితీసిన మూడో సెట్‌లో మార్కస్‌ గెలుపొందాడు. నాల్గో సెట్‌లో జోరందుకున్న నికోలస్‌ 6-3తో ప్రీ క్వార్టర్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. బ్రెజిల్‌ ఆటగాడు థియాగో వైల్డ్‌పై 3-5, 7-6(10-8), 2-6, 6-4, 6-0తో జపాన్‌ ఆటగాడు యోషిహిట నిషియోక గెలుపొందాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో బ్రెజిల్‌ ఆటగాడిపై పైచేయి సాధించిన జపాన్‌ ప్లేయర్‌ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. సెర్బియా ఆటగాడు బొర్నా కోరిక్‌ 3-6, 6-7(5-7), 2-6తో థామస్‌ మార్టిన్‌ (అర్జెంటీనా) చేతిలో మూడో రౌండ్లో పరాజయం పాలయ్యాడు.

Spread the love