మద్దతు మోసం

కాంగ్రెస్‌ కంటే గొప్పగా రైతులకు న్యాయం చేస్తామని, రెట్టింపుఆదాయం కల్పిస్తామని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేస్తామని, మంచి రోజులు కల్పిస్తామని నమ్మబలికిన మోడీ ప్రభుత్వం ఇన్నేండ్ల తర్వాత వారికోసం చేసిందేమిటంటే వెనుక్కుచూసుకోవాల్సిన పరిస్థితి. అయితే నిర్ణయించిన ధరల ప్రకారం కూడా కొనుగోళ్లు జరగడం లేదు. సేకరణపై కేంద్రం చేతులెత్తేసింది. ప్రభుత్వరంగ సంస్థలతో కొనుగోలు చేయించినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను ఇవ్వడం లేదు. కేరళ ప్రభుత్వం మాత్రమే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమ వంతు సహాయం చేస్తోంది.
‘ఇచ్చింది కొసరంత..ప్రచారం బారెడంత’ అన్న రీతిలో ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఎన్నికల సమయం కావడంతో రైతుల పట్ల ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తూ తమ నటనా కౌశల్యంతో రైతులకు దగ్గరయ్యేందుకు కుటిలయత్నాలను ప్రదర్శిస్తోంది. మూడు సాగుచట్టాల రద్దుపై ఏడాదిపాటు రైతులు ఆందోళన చేస్తే ప్రధాని మోడీ వాటిని వెనక్కు తీసుకోవడం మినహా ఇప్పటివరకు వారికి చేసిందేమీ లేదు. మద్దతు ధరకు చట్టబద్దత ప్రస్తావన లేదు. తాజాగా 14రకాల పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తూ కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీ అయితే ఉబ్బితబ్బిపోతున్నారు. పెంచిన ఈ కొద్దిపాటి మద్దతుతోనే తమ పంట ఉత్పత్తులకు రైతులు సరైన ధరలు పొంది మరింత బలోపేతమవుతారని మోడీ ట్వీట్‌ చేయడం మహావిడ్డూరంగా ఉంది. పైగా తొమ్మిదేండ్ల పాలనలో ఇదొక రికార్డు అని కామెంట్‌ చేయడం కొసమెరుపు. ఇవి ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతాయని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు పొగిడేస్తున్నారు. నిజంగా రైతు మోములో సంతోషం వెల్లివిరిసేటట్టు ఈ ధరలతో వారికి కేంద్రం భరోసా కల్పిస్తుందా? అంటే .. ఎన్నికల సీజన్‌ కావడంతో ఇదంతా కేవలం రైతులను దగ్గర చేసుకునే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని తెలుస్తోంది. ఒకరకంగా ఇది రైతును మోసం చేయడమే. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా ఉత్పత్తి వ్యయాన్ని (పెట్టుబడులు, శారీరక శ్రమ) మొత్తంగా పరిగణనలోకి తీసుకుని దానికి అదనంగా 50శాతం కలిపి కనీస మద్దతు ధరను ఇస్తామని అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేని ప్రధాని, అన్నదాత కోసం ఏదో చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.
మోడీ ప్రభుత్వం 2023-24 ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధరలను వెల్లడించింది. ఈ సారి ఎన్నికల కాలం కావడంతో, కూలీలు, యంత్రాలు, పశువులపై పెట్టిన ఖర్చు, విత్తనాలు, ఎరువులు, సాగునీటికై చేసిన ఖర్చు, పెట్టుబడి మీద వడ్డీ, కౌలు, రైతు, కుటుంబం చేసే శ్రమ విలువను పరిగణలోకి తీసుకుని ధరలను నిర్ణయిస్తారని చర్చ జరిగింది. కానీ అవేమీ గాకుండా జాతీయస్థాయిలో పంట సాగయ్యే సగటు ఖర్చులనే పరిగణలోకి తీసుకుని చేతులు దులుపుకుంది. ఈమాత్రానికే కేంద్రం పెద్దలు జబ్బలు చరుచుకోవడం విడ్డూరం. నిజానికి వీరు నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. వరి సాధారణం రకం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,183. ఏ గ్రేడ్‌ రకం రూ.2,203… గతం కంటే ఈ సారి మద్దతు ధర రూ.143లు అదనంగా పెరిగింది. పత్తి రూ.6,020 నుంచి రూ.7,020 (పెరుగుదల 540 నుంచి 640), సోయాబీన్‌ రూ.4,600 (పెరుగుదల 340), వేరుశనగ రూ.6377 (పెరుగుదల 527), కంది రూ.7000 (పెరుగుదల 400), మినుములు రూ.6950 (పెరుగుదల 350) ఇలా ఒక్కొక్క పంటకు ధరను ఖరారు చేశారు. 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రూ.1,400 ఉంటే, ఈ సారి ఖరీఫ్‌(2023-24)లో రూ.2,203కు అంటే రూ.803 పెంచినట్టు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. కాంగ్రెస్‌ పాలనతో బేరీజు వేసుకుంటే ఈ పెరుగుదల ఏమంత గొప్పగా లేదు. ఒకశాతం మాత్రమే అదనం. పత్తి ధర విషయంలోనూ భారీగా ధర పెరిగినట్టు చూపుతున్నా పెరుగుదల చాలా తక్కువ. జాతీయస్థాయిలో సగటు లెక్కల ఆధారంగా మద్దతు ధరలను ఖరారు చేశామని కేంద్రం చెబుతోంది. రాష్ట్రాల వారీగా సాగు ఖర్చులను పరిగణలోకి తీసుకోకుండా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదన్నది వాస్తవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కర్నాటక, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో పెట్టుబడులు అధికంగా ఉంటాయి. ఎక్కువ ఖర్చు ఉన్న చోట రైతుల నష్టాన్ని ఎవరు భరించాలన్నది రైతుసంఘాల ప్రశ్న. పెట్టుబడి ఖర్చుల్లో కనీసం మూడోవంతైనా లేకుండా మద్దతు ధరలు నిర్ణయించడం సరికాదు. కాంగ్రెస్‌ కంటే గొప్పగా రైతులకు న్యాయం చేస్తామని, రెట్టింపు ఆదాయం కల్పిస్తామని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేస్తామని, మంచి రోజులు కల్పిస్తామని నమ్మబలికిన మోడీ ప్రభుత్వం ఇన్నేండ్ల తర్వాత వారికోసం చేసిందేమిటంటే వెనుక్కుచూసుకోవాల్సిన పరిస్థితి. అయితే నిర్ణయించిన ధరల ప్రకారం కూడా కొనుగోళ్లు జరగడం లేదు. సేకరణపై కేంద్రం చేతులెత్తేసింది. ప్రభుత్వరంగ సంస్థలతో కొనుగోలు చేయించినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను ఇవ్వడం లేదు. కేరళ ప్రభుత్వం మాత్రమే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమ వంతు సహాయం చేస్తోంది. మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు జరిగేలా కేంద్రప్రభుత్వం చట్టబద్దత కల్పించినప్పుడే రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపినట్టు అవుతుంది. మోసం చేయాలని చూస్తే రైతుల తిరుగుబాటు ఖాయం.

 

Spread the love